దసరా సెలవులు పాటించకుండా స్కూళ్లు
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేటు విద్యా సంస్థలు బేఖాతరు చేస్తున్నాయి. దసరా సెలవుల్లోనూ యథేచ్ఛగా తరగతులు నిర్వహిస్తూ అధికారులకు సవాలు విసురుతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు కూడా దసరా సెలవులను తప్పక పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆదేశించినా కొన్ని విద్యాసంస్థల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం ఈనెల 23, 24 తేదీల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అత్యవసర ఆదేశాలు జారీ చేసినా విద్యా సంస్థలు పట్టించుకోకుండా యథావిధిగా తరగతులు నిర్వహించాయి. తాజాగా గతనెల 30 నుంచి వచ్చే నెల 12న వరకు దసరా సెలవులు ప్రకటించినా కొన్ని ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కళాశాలలు యథావిధిగా తరగతులు నిర్వహించాయి.
ఫిర్యాదుల వెల్లువ..
జూనియర్ కళాశాలలకు సైతం ప్రభుత్వం సెలవులు ప్రకటించినా పలు కార్పొరేట్ విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదు. సెలవుల్లోనూ విద్యార్థులను ఇళ్లకు పంపించకుండా తరగతులకు పరిమితం చేస్తున్నాయి. రోజువారీ తరగతులతోపాటు ప్రత్యేక క్లాసులు నిర్వహింస్తున్నారు. దీనిపై కొందరు విద్యార్థులు అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు.
జంట జిల్లాల్లో ఉన్న 500కు పైగా కళాశాలలు ఉండగా.. వీటిలో 70 శాతం వరకే సెలవులు పాటిస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థుల ఫిర్యాదులపై స్పందించిన జంట జిల్లాల ఆర్‌ఐఓలు సదరు కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకున్నారు. సెలవులను పాటించకపోతే నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.
నోటీసులు ఇస్తాం..
ప్రభుత్వం సెలవులు ప్రకటించినా కళాశాలలు తరగతులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమే. ఇటువంటి కళాశాలలపై విద్యార్థులు మాకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సదరు ప్రిన్సిపాళ్లకు హెచ్చరికలు జారీ చేశాం. ఆదివారం నుంచి ఈనెల 12వ తేదీ వరకు విద్యాసంస్థలు కొనసాగిస్తే చర్యలు తప్పవు. నోటీసులు జారీ చేయడంతోపాటు ఇంటర్ బోర్డు దృష్టికి తీసుకెళ్తాం.
– చంద్రకళ, జయప్రదబాయి, హైదరాబాద్, రంగారెడ్డి –1 ఆర్‌ఐఓలు