బదిలీల్లో గందరగోళం | Public Health Long Standing Employees transfers | Sakshi
Sakshi News home page

బదిలీల్లో గందరగోళం

Published Sun, Jun 4 2017 10:51 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM

బదిలీల్లో గందరగోళం

బదిలీల్లో గందరగోళం

వెబ్‌ కౌన్సిల్‌ అంటూ ప్రభుత్వం జీవో జారీ 
దరఖాస్తు చేసుకున్న ప్రజారోగ్యశాఖ లాంగ్‌ స్టాండర్డ్‌ ఉద్యోగులు 
తర్వాత సాధారణ కౌన్సెలింగ్‌ అంటూ మరో జీవో 
సర్వీసు ఆధారంగా అభ్యర్థులకు కౌన్సెలింగ్‌
తెల్లవార్లు జరుగుతున్న ప్రక్రియ 
కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కరువు
తీవ్ర ఇబ్బందులు పడుతున్న దూర ప్రాంత ఉద్యోగులు
సాక్షి, రాజమహేంద్రవరం :  ఆంధ్రప్రదేశ్‌ ప్రజారోగ్య, వైద్య ఉద్యోగుల బదిలీల్లో ప్రభుత్వం తీసుకున్న గందరగోళ నిర్ణయాలు ఉద్యోగులను ముప్పతిప్పలు పెడుతున్నాయి. ముందు వెబ్‌ కౌన్సెలింగ్‌ అన్న ప్రభుత్వం, అందుకు అనుగుణంగా ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్న తర్వాత సాధారణ కౌన్సెలింగ్‌ అంటూ, అదీ కూడా వారం రోజుల్లో ముగించాలంది. కౌన్సెలింగ్‌కు సరైన ప్రణాళిక, కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు ఏర్పటు చేయకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని ఏప్రిల్‌ 24న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 64 జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా ప్రజారోగ్య, వైద్య విభాగంలో బదిలీలు చేపట్టేందుకు ఆ శాఖ మే 6న జీవో నంబర్‌ 318 జారీ చేసింది. వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానంలో ప్రభుత్వ ఆస్పత్రులు, బోధనాస్పత్రులలో అదే ప్రాంతంలో ఎక్కువ కాలం (లాంగ్‌ స్టాడింగ్‌) పనిచేస్తున్న వారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఇందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాలలో పనిచేస్తున్న వివిధ విభాగాల ఉద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియను మే 24కి పూర్తి చేస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రణాళికా లోపం, సౌకర్యాలు లేకపోవడం వల్ల అనుకున్న సమయానికి వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించలేదు. 24 అర్ధరాత్రికి ఆయా విభాగాలలో బదిలీల కోసం జీవో నంబర్‌ 64 ద్వారా ప్రభుత్వం ఇచ్చిన సమయం ముగిసింది.  సాధారణ కౌన్సెలింగ్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో జీవో జారీ చేయకుండానే ప్రజారోగ్య,వైద్య విభాగం మే 27న జీవో నంబర్‌ 343 జారీ చేసింది. జూన్‌ 5 నాటికి  బదిలీలు పూర్తి చేసేలా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందు కోసం జోన్‌ స్థాయిలో ఇద్దరు అడిషనల్‌ డైరెక్టర్లు, ఒక రీజనల్‌ డైరెక్టర్‌తో త్రిసభ్య కమిటీ వేసింది. జిల్లాస్థాయిలో కలెక్టర్, డీఎంఅండ్‌ హెచ్‌వో, డీసీహెచ్‌లతో కూడిన త్రిసభ్య కమిటీని కౌన్సెలింగ్‌ కోసం ఏర్పాటు చేసింది. 
మార్గదర్శకాలకు నామం...
రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జోన్‌లలో ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి. జోన్‌–2 పరిధిలోని కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల ఉద్యోగులకు రాజమహేంద్రవరంలోని రీజనల్‌ డైరెక్టరేట్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. శనివారం స్టాఫ్‌ నర్సులు, పీహెచ్‌ఎన్, ఎంపీహెచ్‌ఎస్‌(ఎఫ్‌)ల కౌన్సెలింగ్‌ చేపట్టారు. దరఖాస్తు చేసుకున్న వి«ధంగా అభ్యర్థుల జాబితాను కౌన్సెలింగ్‌ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఒకే ప్రాంతంలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగి తిరిగి అదే ప్రాంతంలో పని చేస్తామని తమ ఆసక్తిని కనబరుస్తూ మూడు ఆప్షన్లు పెట్టారు. ఇలా 153 మంది స్టాఫ్‌ నర్సులలో దాదాపు 40 మంది ఇలానే ఆప్షన్లు ఇచ్చారు. మిగతా వారు మూడు ప్రాంతాలను వేర్వేరుగా ఆప్షన్లుగా పెట్టుకున్నారు. కౌన్సెలింగ్‌ పిలుస్తున్న కమిటీ, అభ్యర్ధి అక్కడే పని చేస్తామని మూడు ఆప్షన్లు పెట్టుకుంటే తిరస్కరిస్తూ మరో చోట తీసుకోవాలని ఖాళీల జాబితా చూపిస్తోంది. ఈ విధానాన్ని ఇతర ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. బదిలీ అంటేనే ఉన్న ప్రాంతం నుంచి మరో చోటుకు వెళ్లడమని, కానీ వారు అదే ప్రాంతంలో పని చేస్తామని ఇచ్చిన మూడు ఆప్షన్లను పెడితే వారికి అప్పటికప్పుడు ఎంచుకోండంటూ లిస్ట్‌ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమంటున్నారు. ఇలా చేయడం వల్ల ఆప్షన్లు పెట్టుకున్న ఉద్యోగులకు మూడింటిల్లో ఒక్కటి కూడా రాలేదని వాపోతున్నారు. మూడు ఆప్షన్లు పని చేస్తున్నచోటే పెట్టుకున్న వారికి అక్కడికక్కడే నచ్చిన ప్రాంతం ఎంచుకోవాలని కమిటీ సభ్యులు జాబితా ఎలా ఇస్తారని స్టాఫ్‌ నర్సులు ప్రశ్నిస్తున్నారు.
ప్రణాళిక లోపం 
శనివారం మూడు విభాగాలకు సంబంధించి 232 మందికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆదివారం తెల్లవారుజాము 4 గంటల వరకు జరిగింది. అర్ధరాత్రి 1 గంటలకు స్టాఫ్‌ నర్సులు, పీహెచ్‌ఎన్‌ విభాగానికి సంబంధించి 178 మందికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కౌన్సెలింగ్‌ నిర్వహణలో ప్రణాళిక లోపం వల్ల ఒక్కొక్క అభ్యర్థికి 20 నుంచి 30 నిమిషాల పాటు సమయం పడుతోంది. ఉద్యోగులు ముందుగా ఎంచుకున్న మూడు ఆప్షన్లు కాకుండా అప్పటికప్పుడు అక్కడే నచ్చిన చోటను ఎంపిక చే సుకుంటుండడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు కౌన్సెలింగ్‌ కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంచినీరు, కూర్చునేందుకు అవసరమైన మేరకు కుర్చీలు లేక ఎక్కడికక్కడ చతికిలపడ్డారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న ఉద్యోగుల అవస్థలు వర్ణనాతీతం. ఆదివారం సీనియర్, జూనియర్‌ అసిస్టెంట్‌లు, ఆఫీస్‌ సబార్డినేట్, ఏఎస్‌వో, టీఎస్‌వో, ఏపీఎంవో, డీపీఎంవో, ఎంపీహెచ్‌ఎస్‌(ఎం) తదితర విభాగాల ఉద్యోగులకు కౌన్సెలింగ్‌ జరుగుతోంది.
ఇష్టానుసారం చేస్తున్నారు... 
ప్రభుత్వం జీవో జారీ చేయకుండానే విభాగం జీవో 343 ద్వారా కౌన్సెలింగ్‌ చేయడం నిబంధనలకు విరుద్ధం. వెబ్‌కౌన్సెలింగ్‌ అన్నారు. తర్వాత సాధారణమన్నారు. ఉద్యోగులకు కనీసం అవగాహణ కల్పించలేదు. మార్గదర్శకాలు పాటించకుండా కమిటీ సభ్యుల ఇష్టానుసారం కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. 
– జి.ఆస్కారరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రజారోగ్య, వైద్య ఉద్యోగుల సంఘం.
వెబ్‌ కౌన్సెలింగ్‌ ఆప్షన్లను పరిగణలోకి తీసుకోం
వెబ్‌ కౌన్సెలింగ్‌ కోసం ఉద్యోగులు దరఖాస్తులు, అందులో పేర్కొన్న మూడు ఆప్షన్లను సాధారణ కౌన్సెలింగ్‌లో పరిగణలోకి తీసుకోవడంలేదు. సర్వీసు ఆధారంగా వరుసగా ఉద్యోగులను పిలుస్తున్నాం. వారికి నచ్చిన చోటను ఎంపిక చేసుకోమంటున్నాం. నిబంధనల ప్రకారమే అంతా చేస్తున్నాం. కేంద్రం వద్ద సౌకర్యాలు ఏర్పాటు చేశాం. 
– షాలినీదేవి, రీజనల్‌ డైరెక్టర్, జోన్‌–2

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement