దామోదరం సంజీవయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి గజమాలను వేస్తున్న కారెం శివాజీ
– దివంగత దామోదరం సంజీవయ్య విగ్రహావిష్కరణలో కారెం శివాజీ
శ్రీశైలం ప్రాజెక్టు: భారత రాజ్యాంగంలో దళిత, గిరిజనుల కోసం పొందుపర్చిన హక్కులను ఏ అధికారి అయిన కాలరాస్తే దండన తప్పదని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ హెచ్చరించారు. సోమవారం ఆయన శ్రీశైలం ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి, దళిత నేత దామోదరం సంజీవయ్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం స్థానిక రెడ్ల కల్యాణ మండపంలో దళిత, గిరిజనులతో ముఖాముఖి అయ్యారు. దళిత, గిరిజన నాయకులు పలు సమస్యలను చైర్మన్ దష్టికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా కారెంశివాజీ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అయినా రాష్ట్రంలో ఇంకా అంటరాని తనం కనిపిస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత గిరిజనులు మౌలికసదుపాయాలకు నోచుకోవడం లేదని చెప్పారు. గాడితప్పిన ఎస్సీ,ఎస్టీ కమిషన్‌పై ప్రత్యేక దషిపెట్టినట్లు తెలిపారు. ఆత్మగౌరవంగా బతకాలంటే ఆర్థికంగా ఎదగాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్యాభివద్ధిలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. చెంచుగిరిజనులు ఎక్కువగా నివసిస్తున్న శ్రీశైల ప్రాంతాన్ని ఏజెన్సీ ప్రాంతంగా ప్రకటించేలా కషి చేస్తానన్నారు. అటవీ భూ హక్కు చట్టం ప్రకారం భూములు పొందిన వారు వాటిని సాగుచేసుకునేలా చర్యలు తీసుకుంటానని హామీచ్చారు. అలాగే సున్నిపెంట ప్రాంతంలో కల్యాణమండపం ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో ఐటీడీఏపీఓ శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతి, తెలుగు విశ్వవిద్యాలయ ఆచార్యులు డాక్టర్ శ్రీనివాసులు, ప్రొగ్రాం కన్వీనర్ కిరణ్‌రాజు, గిరిజన నాయకులు ఆశీర్వాదం, జెండాలమ్మ, రాములునాయక్, హుసేనాయక్, జీవులనాయక్, బీమ్లానాయక్, బద్యేనాయక్, ఎస్సీ వెల్ఫెర్ అసోసియేషన్ నాయకులు లక్ష్మయ్య, అంబేడ్కర్ న్యాయసేవా సమితి నాయకులు తులసీరామ్, దళిత జనజీవనజ్యోతి సర్వీస్ సొసైటీ నాయకులు జాకోబ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసాదరావు, మాలమహానాడు నాయకులు సీహెచ్ గాలెయ్య, మహిళా నాయకురాలు నాగలక్ష్మి, డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.