అర్జీలకు సత్వర పరిష్కారం
-
జేసీ ఇంతియాజ్ ఆహ్మద్
ఓజిలి : అర్జీదారులు వినతలకు సత్వరమే పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ ఆహ్మద్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో జేసీ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని గ్రామపంచాయతీలు నుంచి అధిక సంఖ్యలో అర్జీదారులు హాజరయ్యారు. గ్రీవెన్స్‌సెల్‌కు 220 వినతులు అందాయలని తహసీల్దార్ చెంచుకృష్ణమ్మ తెలిపారు. గుర్రంకొండ గ్రామంలో పొలాల్లోకి వెళ్లే దారి, డొంకను నాయుడుపేటకు చెందిన ఓ కోపల్లి హనుమంతునాయుడు ఆక్రమించుకున్నాడని ఫిర్యాదు చేశారు. మేత పోరంబోకు భూమి రెండెకరాలు ఆక్రమించి పంటలు సాగు చే స్తూ దళితులను దారులో పోనీకుండా అడ్డుకుంటూ తమపై కేసులు పెడుతున్నాడని విన్నవించారు. దళితులపై కేసులు పెట్టిన వ్యక్తిని రెవెన్యూ అధికారులు ఎందుకు వెనకేసుకుని వస్తున్నారని జేసీ ప్రశ్నించారు. దళితులను భూములలోకి వెళ్లకుండా డొండను ఆక్రమించిన వ్యక్తిపై కేసులు పెట్టాలని తహశీల్దార్ చెంచుకృష్ణమ్మ ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోలతో ఆయన సమావేశం నిర్వహించారు. వెంటనే అర్జీలకు పరిష్కారం చూపి ప్రతి అర్జీను కంప్యూటర్‌లో పొందుపరచాలన్నారు. ఆర్డీఓ శీనానాయక్, ఎంపీడీఓ పీవీ నారాయణ, ఇరిగేషన్ డీఈ కోటేశ్వర్‌రావు, హోసింగ్ ఏఈ సత్యనారాయణ, వీఆర్వోలు, ఐసీడీఎస్ పలువురు అధికారులు పాల్గొన్నారు.