రగడ.. రగడ
జన్మభూమి–మా ఊరు గ్రామ సభలు రెండో రోజైన మంగళవారం వేడెక్కాయి. ప్రతిచోట నిలదీతలు, నిరసనలు మార్మోగాయి. సమస్యలు పరిష్కారం కాలేదంటూ బీజేపీ నాయకులు జన్మభూమి సభలో నిరసన వ్యక్తం చేయగా.. మరోచోట అవినీతిపై టీడీపీలోని రెండు వర్గాలు రోడ్డెక్కాయి. గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న కంసాలి బేతపూడి గ్రామస్తులు గ్రామసభను అడ్డుకున్నారు. పోలీసులు ఉద్యమకారులను అరెస్ట్ చేసి నరసాపురం తరలించారు. పోలీస్ స్టేషన్ ఎదుట సీపీఎం నేతలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : టీడీపీకి మిత్రపక్షమైన బీజేపీ షాక్ ఇచ్చింది. మొగల్తూరు మండలం మోడి గ్రామంలో ప్రధానమైన వియర్ చానల్ పనులు పూర్తికాకపోవడం, «గ్రామంలోని దర్భరేవు డ్రెయిన్‌పై వంతెన నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకుంటామని బీజేపీ నాయకులు ముందుగానే ప్రకటించారు. అధికారులెవరినీ సభకు రానివ్వకుండా ప్రాంగణం గేట్లకు తాళాలు వేశారు. వేదిక వద్ద బల్లలు, కుర్చీలను విసిరేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో గ్రామస్తులు ఆగ్రహంతో రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆ సభకు హాజరుకాకుండా మొహం చాటేశారు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ తరలింపు విషయంలో ప్రభుత్వం తన వైఖరి తెలియజేయాలంటూ నరసాపురం మండలం కంసాలి బేతపూడిలో జన్మభూమి సభను గ్రామస్తులు అడ్డుకున్నారు. నీటిసంఘం అధ్యక్షుడు పొత్తూరి రామరాజు, అధికారులు, ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి గోబ్యాక్, గోబ్యాక్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఉద్యమకారులను అరెస్ట్ చేసి జీపులో ఎక్కించారు. గ్రామస్తులు, మహిళలు పోలీసు జీప్ ఎదుట బైఠాయించగా.. కానిస్టేబుళ్ల సాయంతో మహిళలను పక్కకు లాగి జీపును పోనిచ్చారు. నిరసనకారులను వదలకపోవడంతో సీపీఎం నాయకులు నరసాపురం వెళ్లి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంలో సీపీఎం నాయకులు, రూరల్ ఎస్సై కె.సతీష్‌కుమార్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్తత ఏర్పడింది. చివరకు పోలీసులు అందరినీ చెదరగొట్టారు. ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అవినీతి బట్టబయలైంది. ఉంగుటూరు మండలం వెల్లమిల్లిలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో టీడీపీ సీనియర్ నాయకుడు బండి స్వరూప్, అదే పార్టీకి చెందిన సర్పంచ్ సర్లమామిడి నాగేశ్వరరావు వర్గాల మధ్య జన్మభూమి సభలో వివాదం తలెత్తింది. సిమెంట్ రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని, కనీసం క్యూరింగ్ కూడా చేయలేదని బండి స్వరూప్ వర్గీయులు సర్పంచ్ నర్లమామిడి నాగేశ్వరరావును నిలదీశారు. దీంతో సర్పంచ్ వర్గీయులు నీరు–చెట్టు పథకంలో మట్టిని అమ్ముకున్నారంటూ బండి స్వరూప్‌పై విరుచుకుపడ్డారు. ఇరువర్గాలు పోట్లాడుకుని వారి అవినీతిని బయటపెట్టుకున్నారు. యలమంచిలి మండలం చించినాడలో జన్మభూమి కమిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ప్రజలు ధ్వజమెత్తారు. జన్మభూమి కమిటీలను రద్దు చేయాలంటూ మహిళలు ప్ల కార్డులు ప్రదర్శిస్తూ పాలకవర్గానికి బాసటగా నిలిచారు. వారిని అడ్డుకోవడానికి జెడ్పీటీసీ బోనం వెంకట నరసింహరావు, తహసీల్దార్ వంటెద్దు స్వామినాయుడు ప్రయత్నించడంతో సభలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వేలేరుపాడు మండలం రుద్రమకోట గ్రామసభలో రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వటం లేదని తహసీల్దార్‌ను, ఇతర అధికారులను గ్రామస్తులు నిలదీ శారు. టి.నరసాపురం మండలం బండదవారిగూడెంలో సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించే విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య రెండు గంటలపాటు వాగ్వివాదం చోటుచేసుకోవడంతో జన్మభూమి సభ ఆలస్యమైంది. చింతలపూడి మండలంలో నిర్వహించిన గ్రామసభల్లో ఇళ్లు, పెన్షన్లు, చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న వారికిచ్చే పరిహారంపై అధికారులను రైతులు నిలదీశారు. యర్రంపల్లిలో చింతలపూడి ఎత్తిపోతల పథకంతోపాటు పీహెచ్‌సీ భవనాన్ని ఎందుకు ప్రారంభించ డం లేదని సీపీఐ, వైఎస్సార్ సీపీ నాయకులు అధికారులను నిలదీశారు. ఊటసముద్రంలో నిర్వహించిన గ్రామసభలో నాయకపోడు గిరి జనులకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతూ జన్మభూమి గ్రామసభను అడ్డుకున్నారు. దాదాపు 2 గంటలకు పైగా సభను జరగనివ్వకుండా కార్యాలయం ముందు కూర్చుని ధర్నా చేశారు. జిల్లా అధికారులు ఇచ్చిన హామీ మేరకు ఆందోళన విరమించారు. జీలుగుమిల్లిలో కార్డులు ఇచ్చి కదలాలంటూ తహసీల్దార్‌ను ఘెరావ్ చేశారు.