అనంతలో రాహుల్.. మొదలైన రభస
అనంతపురం: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాదయాత్ర నిమిత్తం అనంతపురం చేరుకున్నారు. శుక్రవారం ఉదయం బెంగళూరు నుంచి ఆయన సరిహద్దు ప్రాంతమైన కొడికొండ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కొడికొండ చెక్ పోస్ట్ వద్ద టీడీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. రాహుల్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశాయి. రాహుల్ గాంధీ కాన్వాయ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని టీడీపీ శ్రేణులను అరెస్టు చేశారు.
కాగా, 8 గంటలకు ఓబుళ దేవర చెరువుకు చేరుకొని 8.05 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు. మార్గమధ్యలో అంబేద్కర్, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి ప్రసంగిస్తారు. ఓబుళ దేవర చెరువు గ్రామంలో రైతులు, చేనేత కార్మికులతో 45 నిమిషాల పాటు మాట్లాడుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం 10 నిమిషాలపాటు విద్యార్థులతో ముచ్చటిస్తారు. 9.45 గంటలకు మామిళ్లకుంటపల్లికి చేరుకుంటారు.
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న హరినాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. 11 గంటలకు డబురవారిపల్లికి చేరుకొని డ్వాక్రా గ్రూపు సభ్యులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కొండకమర్లకు వెళ్లి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలతో మాట్లాడుతారు. తర్వాత అక్కడి నుంచి వాహనంలో బయల్దేరి పుట్టపర్తికి చేరుకుంటారు. స్థానికుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశమవుతారు. సాయిబాబా మహా సమాధిని దర్శించుకుంటారు. ఓబుళ దేవర చెరువు నుంచి కొండకమర్ల గ్రామం వరకు రాహుల్ గాంధీ దాదాపు 10 కిలోమీటర్ల మేర నడవనున్నారు.