సాక్షి, రాజమహేంద్రవరం :తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, కళల పరిరక్షణ, అధ్యయనమే ధ్యేయంగా తెలుగు భాష ఖ్యాతిని ఇనుమడింపజేయాలన్న లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి ఎ¯Œæటీ రామారావు 1985లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. దానికి అనుబంధంగా తెలుగువారి సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరంలో 1987లో తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠానికి అంకురార్పణ చేశారు. ప్రవేశాలు, పరిశోధనలతో మొన్నటివరకూ ఈ పీఠం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లింది. కానీ రాష్ట్ర విభజన అనంతరం పాలకుల నిర్లక్ష్యంతో ప్రస్తుతం ఆ ప్రభలు మాసిపోతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌లో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రం తెలంగాణకు వెళ్లిపోయింది. దీంతో రాజమహేంద్రవరంలోని సాహిత్య పీఠంతోపాటు, కూచిపూడి, శ్రీశైలంలోని పీఠాల్లో ప్రవేశాలు, బోధనలకు అతీగతీ లేకుండా పోయింది. దీనిపై తెలుగు భాషావేత్తల ఆందోళనల నేపథ్యంలో రాజమహేంద్రవరం కేంద్రంగా తెలుగు విశ్వ విద్యాలయాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఏడాది కిందట ఇచ్చిన ఈ హామీ ఎప్పటిలానే అమలుకు నోచుకోలేదు.
ఏవీ నాటి కళకళలు?
ఏటా 40 మంది పీజీ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, 19 మంది పీహెచ్‌డీ విద్యార్థులతో రాజమహేంద్రవరం సాహిత్య పీఠం కళకళలాడేది. ప్రస్తుతం ఆ వెలుగులు కరువయ్యాయి.
తెలంగాణ పరిధిలోకి వెళ్లిన తెలుగు విశ్వ విద్యాలయం ఆరు నెలలు ఆలస్యంగా ప్రవేశాలకు అనుమతి ఇచ్చింది. దీంతో పీజీలో 20 సీట్లకుగానూ తొమ్మిది మందే చేరారు. వీరికి కూడా సకాలంలో పరీక్షలు నిర్వహించలేదు.
ఎనిమిది మంది అధ్యాపకులకుగానూ ఒక్కరే బోధన చేస్తున్నారు.
అధ్యాపకుల కొరత కారణంగా మొదటి సంవత్సరం పాఠ్యాంశాలు పూర్తయ్యేసరికే మొదటి సంవత్సరం విద్యార్థులు రెండో ఏడాదిలోకి వెళ్లిపోయారు. కానీ, వీరంతా ప్రస్తుతం మొదటి ఏడాది రెండో సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమవుతున్న దుస్థితి నెలకొంది.
ముగ్గురు విద్యార్థులు మాత్రమే పీహెచ్‌డీ చేస్తున్నారు. పరిశోధనలు చేసి పత్రాలు సమర్పించిన వందలాది మంది విద్యార్థులకు అధ్యాపకుల కొరత కారణంగా ఇప్పటికీ పట్టాలు అందలేదు.
విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా పీజీ మొదటి ఏడాది ప్రవేశాలకు అనుమతి లభించలేదు. దీంతో తెలుగు భాష అభ్యసించాలనుకున్న ఔత్సాహిక విద్యార్థులకు అవకాశం లేకుండా పోయింది.
పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వారి మాతృభాష పరిరక్షణకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, పరిశోధనలకు పెద్ద పీట వేయడం వంటి అనేక చర్యలు చేపడుతూండగా.. మన రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉండడం దురదృష్టకరమని భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
513 మంది విద్యార్థులకు ఎంఏ, 390 మందికి ఎంఫిల్, 341 మందికి పీహెచ్‌డీ పట్టాలు అందించిన ఘన చరిత ఉన్న సాహిత్య పీఠానికి పూర్వవైభవం తేవాలని కోరుతున్నారు.
మాటలు అలా.. చేతలు ఇలా..
తెలుగు వ్యావహారికా భాషోద్యమానికి నేతృత్వం వహించిన ‘ఆది’ గురువు గిడుగు రామ్మూర్తి పంతులుగారి జయంతి సందర్భంగా ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా తెలుగును పరిరక్షిస్తామని ప్రసంగాలు.. కవులు, రచయితలకు సత్కారాలు చేస్తున్న ప్రభుత్వ పెద్దలు.. మరోపక్క తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష లేకుండా చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. గతంలో డిగ్రీ మొదటి ఏడాది రెండు సెమిస్టర్లు, రెండో ఏడాది రెండు సెమిస్టర్లలో తెలుగు సబ్జెక్ట్ ఉండేది. ప్రస్తుతం మొదటి మూడు సెమిస్టర్లకే తెలుగును పరిమితం చేశారు. రెండో ఏడాది నాలుగో సెమిస్టర్‌ను ఎత్తివేశారు. దీనివల్ల తెలుగులో ఎంఏ చేయాలనుకున్న విద్యార్థులకు అవకాశం ఉండదు. ఫలితంగా నూతన ఉపాధ్యాయుల రాక తగ్గిపోయి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తెలుగు భాష బోధన కుంటుపడనుంది.