ప్రకృతి ప్రేమికుడు
♦ దేశ, విదేశాల నుంచి మొక్కలు, చెట్ల సేకరణ
♦ వంద ఎకరాల్లో పెంపకం, సంరక్షణ
♦ బొటానికల్ గార్డెన్ ఏర్పాటే లక్ష్యంగా సాగుతున్న రాందేవ్
గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఆయనకు చిన్ననాటి నుంచి మొక్కలంటే ప్రాణం. అటవీశాఖలో కాంట్రాక్టర్‌గా పనిచేసే తండ్రి వెంట అడవుల్లో తిరుగుతూ మొక్కలు, చెట్లపై మరింత ఆసక్తిని పెంచుకున్నారు. పెద్దయ్యాక వ్యాపారంలో స్థిరపడినా.. వాటిపై మక్కువ మాత్రం వదలలేదు. దేశంలోనే అతిపెద్దదైన బొటానికల్ గార్డెన్ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆయనే వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామానికి చెందిన రాందేవ్. 25 ఏళ్ల క్రితం వ్యాపారంలో అడుగుపెట్టి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఒకవైపు వ్యాపారాన్ని చూసుకుంటూనే మరోవైపు తనకు ఆసక్తి ఉన్న మొక్కలు, చెట్ల పెంపకంపై దృష్టి సారించారు. ఈ ప్రకృతి ప్రేమికుడి కథనమే ఆదివారం ప్రత్యేకం..
- మొయినాబాద్
శంకర్‌పల్లి మండలం పొద్దటూరు, మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామాల సరిహద్దుల్లో భూమి కొనుగోలు చేసి వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేశారు రాందేవ్. వంద ఎకరాలకు విస్తరించిన క్షేత్రంలో దేశ, విదేశాల నుంచి తెచ్చిన వేల మొక్కలు, చెట్లు పెంచుతు న్నారు. ప్రస్తుతం ఇక్కడ ఇటలీ నుంచి తెచ్చిన ఆలీవ్, వియాత్నం నుంచి తెచ్చిన ఫైకస్, ఇండోనేషియా నుంచి తెచ్చిన రెగెస్టోమియా వంటి సుమారు వెయ్యి రకాల చెట్లు ఉన్నాయి. 1,200 ఏళ్ల నాటి ఆలివ్ చెట్టు, 2008 ఒలింపిక్స్ సందర్భంగా చైనాలో ప్రత్యేకంగా పెంచిన చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
రోడ్డు విస్తరణలో తొలగిస్తున్న చెట్లను చూసి..
2006-07లో హైదరాబాద్-బీజాపూర్ రహదారి విస్తరణ సందర్భంగా రోడ్డుకు ఇరువైపుల ఉన్న పెద్ద పెద్ద మర్రి వృక్షాలను నరికేస్తున్నారనే విషయం తెలుసుకున్న రాందేవ్ వాటిని రక్షించేందుకు ముందుకొచ్చారు. అధికారులతో మాట్లాడి 200 చెట్లకు పునర్జన్మనిచ్చారు. భారీ క్రేన్ల సాయంతో వేళ్లతో సహా పెకిలించి వాటిని భారీ వాహనాల్లో తన వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. వేళ్లు పాడవకుండా రసాయ ప్రక్రియ చేసి చెట్లను క్రేన్ల సాయంతో నాటారు. ఇలా మొత్తం చెట్లు తరలించేందుకు సుమారు రూ.37 లక్షలు ఖర్చు చూశారు. నాటిన చెట్లను రక్షించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేశారు.
బొటానికల్ గార్డెన్ ఏర్పాటే లక్ష్యం
మన దేశంలో బొటానికల్ గార్డెన్లు చాలా తక్కువగా ఉన్నా యి. ఈ విష యమై పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశాను. పలువురు ముఖ్యమం త్రులను కలిసి వివరించాను. ఉత్తర ప్రదేశ్ సీఎం అఖిలేష్‌యాదవ్ స్పందించారు. ఆ రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయడమే నా లక్ష్యం. దీనికోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధం. - రాందేవ్
1,500 ఏళ్ల నాటి చెట్టు..
ఇటీవల మహేశ్వరం మండలం మన్‌సాన్‌పల్లిలో రియల్ వ్యాపారులు ఓ భారీ చెట్టును నరికేయడానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న రాందేవ్ అక్కడికి వెళ్లి పరిశీలించారు. అది ఆఫ్రికన్ జాతికి చెందిన అడెన్‌సోనియా డిజిటాటా అనే 1,500 ఏళ్ల నాటి వృక్షమని తెలుసుకున్నారు. దాన్ని రూ.14 వేలకు కొనుగోలు చేసి జేసీబీల సాయంతో కూకటి వేళ్లతో తొలగించారు. 45 అడుగుల చుట్టుకొలత, 70 అడుగుల ఎత్తున్న ఈ భారీ వృక్షాన్ని తరలించేందుకు ముంబై నుంచి ప్రత్యేకంగా భారీ వాహనాన్ని తెప్పించారు. రెండు భారీ క్రేన్ల సహాయంతో వృక్షాన్ని భారీ వాహనంలోకి ఎక్కించి తన వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. ఆ చెట్టు వేర్లకు రసాయన ప్రక్రియ చేపట్టి భారీ క్రేన్ల సహాయంతో నాటారు. వృక్షాన్ని తరలించేందుకు రూ.10 లక్షలకు పైగా ఖర్చుచేశాడు.