
ఖాకీల్లో కలవరం
* ఎస్పీ ఇంట్లో ఆర్డర్లీ విధానంపై కదలిక
* పోలీస్ బాస్ అరాచకాలను ఎండగట్టిన హోంగార్డులు
* హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్‌తో పోలీసుల్లో అలజడి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా పోలీస్ విభాగంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఎస్పీ నవీన్‌కుమార్ హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారనే ఆరోపణలపై ఉన్నతస్థాయి కమిటీతో ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అనూహ్యంగా కొందరు హోంగార్డులు మీడియా ముందుకు వచ్చి ఎస్పీ అరాచకాలను ఎండగట్టారు. క్యాంపు కార్యాలయంలో, వ్యక్తిగత వ్యవహారాల్లోనూ హోంగార్డులతో చాకిరీ చేయించుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ తంతు జిల్లా పోలీస్‌వర్గాలను ఒక్కసారిగా కలవరానికి గురిచేసింది. పోలీస్ బాస్‌పై హోంగార్డుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ఆ శాఖలో గందరగోళం నెలకొంది.
హెడ్‌కానిస్టేబుల్‌పై వేటు..
ఇదిలా ఉండగా బంట్వారం పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మహేష్‌ను ఎస్పీ నవీన్‌కుమార్ ఆదివారం సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే హోంగార్డుల మీడియా సమావేశం జరిగిన కొద్ది సమయంలోనే ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు రావడం గమనార్హం. మహేష్ గతంలో ఎస్పీ కార్యాలయంలో సీసీగా పనిచేశారు. అప్పట్లో పెట్రోల్, డీజిల్ వినియోగంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
అయితే అకస్మాత్తుగా మహేష్‌పై సస్సెన్షన్ వేటు వేయడం పోలీస్ అధికారుల్లో చర్చనీయాంశమైంది. హోంగార్డులను వ్యక్తిగత పనులకు వాడుకుంటున్న ఫొటోలను సోషల్ మీడియాలో మహేష్ పోస్టు చేశాడనే ప్రచారం సాగుతోంది. ఈ చర్యలపై ఎస్పీ నవీన్ ఆగ్రహించి సస్పెండ్ చేసినట్లు సర్వత్రా గుసగుసలు వినిపిస్తుండడం గమనార్హం.