హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఎస్పీపై వెట్టిచాకిరి వ్యవహారానికి సంబంధించి డీజీపీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. డీఐజీ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విచారణకు మంగళవారం 18మంది హోంగార్డులు హాజరయ్యారు. కాగా రంగారెడ్డి జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారనే ఆరోపణలపై ఉన్నతస్థాయి కమిటీతో ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
గతంలోనూ పలు ఆరోపణలు ఎదుర్కొన్న జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ తాజాగా ఇంటి పనులకు హోంగార్డులను వినియోగించుకున్నారనే వార్తలు పతాక శీర్షికలకు ఎక్కాయి. ఆర్డర్లీ వ్యవస్థను ఎనిమిదేళ్ల క్రితం రాష్ర్ట ప్రభుత్వం రద్దు చేసినా ఇదేమీ పట్టని పోలీసు బాసు హోంగార్డుల ఇంటి సేవలతో తరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కిందిస్థాయి సిబ్బందిని గౌరవప్రదంగా చూసుకోవాల్సిన ఉన్నతాధికారి.. వారితో గొడ్డుచాకిరీ చేయిస్తున్న ఫొటోలు, వీడియోలు మీడియాలో హల్‌చల్ చేయడంతో పోలీస్‌వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.