‘రేషన్‌’ కోసం మైళ్ల దూరం.. | 'Ration' miles for walk | Sakshi
Sakshi News home page

‘రేషన్‌’ కోసం మైళ్ల దూరం..

Published Tue, Jan 10 2017 2:03 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM

‘రేషన్‌’ కోసం మైళ్ల దూరం..

‘రేషన్‌’ కోసం మైళ్ల దూరం..

కామారెడ్డి :  జిల్లాలో ఒక మున్సిపాలిటీతో పాటు 323 పంచాయతీలు ఉన్నాయి. రెవెన్యూ గ్రామాలు 478. మరో వందకుపైగా శివారు గ్రామాలు, గిరిజన తండాలు ఉన్నాయి. జిల్లాలో 2,22,513 కుటుంబాల్లో 9,72,625 నివసిస్తున్నారు. అన్ని రకాల రేషన్‌కార్డులు కలిపి 2,46,039 ఉన్నాయి. వీరికి 578 రేషన్‌ షాపుల ద్వారా నెలనెలా 48.50 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యం సరఫరా అవుతోంది. అలాగే కిరోసిన్, గోధుమలు, చక్కెర సరఫరా చేస్తున్నారు. అయితే అన్ని సరుకులను ఒకేసారి అందించడం లేదు. బియ్యం, చక్కెర ఒకసారి, కిరోసిన్‌ మరోసారి పంపిణీ చేస్తున్నారు. దీంతో ఆయా సరుకులను తెచ్చుకోవడానికి లబ్ధిదారులు రేషన్‌ దుకాణాలకు రెండు సార్లు వెళ్లాల్సి వస్తోంది. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో 30 రేషన్‌ షాపులు ఉండగా, బాన్సువాడ, ఎల్లారెడ్డిలాంటి పట్టణాల్లో పదికిపైగా రేషన్‌ షాపులు ఉన్నాయి. చాలా గ్రామాల్లో రేషన్‌ దుకాణాలు లేకపోవడంతో ప్రజలు సరకుల కోసం పొరుగూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలో 70కి పైగా హాబిటేషన్లలో రేషన్‌షాపులు లేవు. ఆయా గ్రామాల ప్రజలంతా సమీపంలో ఉన్న రేషన్‌షాప్‌లకు వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. అక్కడికి వెళ్లేసరికి డీలర్‌ లేకుంటే గంటల తరబడి వేచి ఉండాల్సిందే. ఒక్కోసారి డీలర్లు సమయానికి రాలేదంటూ రేషన్‌ సరకులు ఎగ్గొడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

మారుమూల గ్రామాల్లో..
మారుమూల మండలాల్లోని చాలా గ్రామాల్లో రేషన్‌ షాపులు అందుబాటులో లేవు. జిల్లాలో మారుమూల నియోజకవర్గమైన జుక్కల్‌లో పరిస్థితి మరీ దారుణం. జుక్కల్‌ మండలంలో లొంగన్, చిన్నగుళ్ల, కత్తల్‌వాడి, మంగాపూర్, మెబాపూర్, సిద్దాపూర్, దోస్‌పల్లి, బంగారుపల్లి, సావర్‌గావ్, శక్తినగర్, మైలార్‌ తదితర గ్రామాల్లో రేషన్‌ షాపులు లేవు. ఈ మండలంలో 24 రేషన్‌ షాపులు ఉండగా 13 మంది డీలర్లు మాత్రమే ఉన్నారు. 11 దుకాణాలు ఇన్‌చార్జీల పాలనలో నడుస్తున్నాయి. మద్నూర్‌ మండలంలో 42 గ్రామాలుండగా 33 గ్రామాల్లో రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. గోజేగావ్, సలాబత్‌పూర్, ఇలేగావ్, లచ్మాపూర్, రాచూర్, చిన్న తడ్గూర్, ఖరగ్, అంతాపూర్, సోమూర్‌ గ్రామాల్లో రేషన్‌ దుకాణాలు లేవు. ఆయా గ్రామాల ప్రజలు పక్క గ్రామంలోని రేషన్‌ దుకాణాలకు వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. పిట్లం, బిచ్కుంద, పెద్దకొడప్‌గల్, నిజాంసాగర్‌ మండలాల్లోనూ ఇదే పరిస్థితి..

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్‌ మండలంలో తుక్కోజీవాడి, ముద్దొజీవాడి గ్రామాల్లో రేషన్‌ షాపులు లేవు. లింగంపేట మండలంలో గట్టుమైసమ్మతండా, ఒంటరిపల్లి, కొట్టాల్‌గడ్డ తండా, రాంపల్లి గ్రామాల ప్రజలు కూడా రేషన్‌ సరకుల కోసం పొరుగు గ్రామాలపై ఆధారపడాల్సిందే. గాంధారి మండల కేంద్రానికి ఆవాస గ్రామాలైన మాధవపల్లి, గుడిమెట్, పిసికిల్‌గుట్ట, తిమ్మాపూర్‌ గ్రామాల ప్రజలు గాంధారికి వెళ్లాల్సి. కరక్‌వాడీ గ్రామస్తులు బూర్గుల్‌కు వెళతారు. కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లోనూ కొన్ని గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంది. రేషన్‌షాపులు ఏర్పాటు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకున్నా లాభం లేకుండాపోయిందని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాల్లో రేషన్‌ షాప్‌లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement