అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
రేపల్లె: మండలంలోని పెనుమూడి చెక్‌పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ ఎన్.కిషోర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ... అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో విజిలెన్స్ అడిషనల్ డీఎస్పీ శోభామంజరి ఆదేశాల మేరకు తమ సిబ్బందితో నిఘా ఉంచి పెనుమూడి చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. రేపల్లె వైపునుంచి కృష్ణాజిల్లావైపు వెళ్తున్న ఏపీ28డబ్లు్య 6437 నంబరుగల పాల లారీ డ్రై వర్ తనిఖీలను గమనించి లారీని పక్కనే ఉన్న మట్టిరోడ్డుకు తరలించి అక్కడే వదిలి పారిపోయాడన్నారు. లారీలో గోతాలు మార్చి నింపిన 83 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నాయని, రికార్డులను పరిశీలించగా ఇవి కర్లపాలెంకు చెందిన మహ్మద్ అబీబ్‌బేగ్‌దిగా గుర్తించామన్నారు. మహ్మద్ అబీబ్‌బేగ్‌పై ఈ సంవత్సరం అక్రమంగా బియ్యం తరలింపుపై ఇప్పటికే ఐదు సార్లు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రేపల్లె పోలీసులకు సమాచారం అందించి, లారీని రేపల్లె ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించినట్లు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తహసీల్దార్ టి.శ్రీనివాసరావు, కానిస్టేబుల్ మహేష్, ఆర్‌ఐ పి.సుధీర్ తదితరులున్నారు.