తొమ్మిదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏలుబడిలో మార్పులేదని ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు.
విజయనగరం: తొమ్మిదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏలుబడిలో మార్పులేదని వైఎస్సార్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబులా రైతు రుణమాపీ చేస్తామంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హమీ ఇస్తే గడిచిన ఎన్నికల్లో టీడీపీ గల్లంతయ్యేదన్నారు.
వచ్చే నెల 18న ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్న ఆయన శనివారం విజయనగరం వచ్చారు. ఈ సందర్బంగా స్థానిక హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఆర్టీసీకీ సహాయం చేస్తారని భావిస్తే.. జీతాలివ్వటానికి నెలకు ఒక డిపోను తాకట్టుపెట్టే దుస్థితికి తీసుకువచ్చారనీ విమర్శించారు. ఆయన పాలనాకాలమంతా తెలుగు తమ్ముళ్ల అక్రమ రవాణాకు సహకరిస్తూ వారికి దోచి పెట్టడమే పనిగా పెట్టుకున్నారని, ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన ఓ కార్మిక ద్రోహి అని విరుచుకుపడ్డారు. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ మనుగడ ప్రశార్థకం కానుందన్నారు.
తుప్పుపట్టిన బస్సుగుర్తున్న ఎంప్లాయీస్ యూనియన్, వెలుగుతగ్గిన కాగడా యూనియన్ కార్మికుల ప్రయోజనాలు కాపాడలేకపోతున్నాయని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 900 అద్దెబస్సులను తీసుకునేందుకు టెండర్‌లు పిలిస్తే ఎందుకు కట్టడి చేయలేదని ఆ యూనియన్లను ప్రశ్నించారు. ఏటా లక్షా 50వేల కోట్ల బడ్జెట్‌ను పెట్టే ప్రభుత్వం రవాణా వ్యవస్థ కోసం కనీస బడ్జెట్ కేటాయించకపోవటం దారుణమన్నారు.
రాబోయే కాలంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖాయమని, ఆయన తొలి సంతకం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఫైల్‌పైనేనని హమీ ఇచ్చినట్లు చెప్పారు. 67 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న వైఎస్సార్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకత్వాన్ని బలపర్చటం ద్వారా ఆర్టీసీని కాపాడుకోవాలన్నారు. అసెంబ్లీలో గళం ఎత్తే అవకాశం తమకు తప్ప మరొకరికి ఉండదని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు రానున్న ఎన్నికల్లో తమ యూనియన్‌ను ఎన్నుకోవాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, పాముల పుష్ఫశ్రీవాణి, పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్.వి.ఎస్.కె.కె.రంగారావు(బేబీనాయన), మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి తదితరులు పాల్గొన్నారు.