ఓటర్లుగా నమోదు కండి
–జిల్లా అధికారులకు, సిబ్బందికి జాయింట్‌కలెక్టర్ ఆదేశం
కర్నూలు(అగ్రికల్చర్): అన్ని శాఖల జిల్లా అధికారులు, వారి కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది శాసనమండలి అనంతపురం, కర్నూలు, వైఎస్‌ఆర్ జిల్లా పట్టభద్రుల నియోజక వర్గం ఓటర్లుగా నమోదు కావాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. సోమవారం ఉదయం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం తర్వాత ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... ప్రభుత్వ అధికారులు, సిబ్బందిలో ఎక్కువ మంది పట్టభద్రులు ఉన్నారన్నారు. 2011లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయని అప్పుడు పట్టభద్రుల ఓటర్ల జాబితా తయారు చేశామని అయితే ఆ జాబితా ఈ ఎన్నికలకు చెల్లుబాటు కాదని చెప్పారు. 2013 అక్టోబరు31 లోపు డిగ్రీ పూర్తి చేసిన వారందరూ ఓటర్లుగా నమోదు అయ్యేందుకు అర్హులేనన్నారు. ఫారం–18 దరఖాస్తులను పూర్తి చేసి ఆధార్ కార్డు జిరాక్స్‌కాపీ, రెండు కలర్ పాస్‌ఫొటోలు జత పరచి ఇవ్వాలని సూచించారు. ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా తయారీకి నోడల్ అధికారిగా జెడ్పీ సీఈఓ వ్యవహరిస్తున్నారని అయనకు పూరించిన దరఖాస్తులు ఇవ్వాలని తెలిపారు. అనంతరం ఒక్కో జిల్లా అధికారికి 20 ప్రకారం ఫారం–18 దరఖాస్తులను పంపిణీ చేశారు. ఓటరు నమోదుపై అనుమానాలు ఉంటే 08518–220125కు ఫోన్ చేయవచ్చని వివరించారు. కాగా ఈ– ఆఫీసుల నిర్వహణపై జిల్లా అధికారులు దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో జేసీ–2 రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, సీపీఓ ఆనంద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.