సాంకేతిక సమస్యలు అధిగమించాం
-
స్మార్ట్ పల్స్ సర్వే జిల్లా ప్రత్యేకాధికారి శ్రీధర్
చంద్రశేఖరపురం(కొడవలూరు):
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వే ప్రాధమిక దశలో సాంకేతిక సమస్యలు వెన్నాడిన మాట వాస్తవమేనని, అయితే ఆ సమస్యలను అధికమించినట్లు సర్వే జిల్లా ప్రత్యేకాధికారి బి.శ్రీధర్ స్పష్టం చేశారు. చంద్రశేఖరపురంలో జరుగుతున్న ప్రజా సాధికార సర్వేను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సర్వేకు తొలుత రాష్ట్రమంతా ఒకే సర్వర్ ఉండడం, సిబ్బందికి తగు శిక్షణ లేకపోవడం వల్ల సర్వే మందగించిందన్నారు. అయితే ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికిపోవడంతో జిల్లాకు ఒక సర్వర్ వంతున ఆధునిక పరిజ్ఞానం కలిగిన సర్వర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీంతో ప్రాధమిక దశలో తలెత్తిన సమస్యలకు కళ్లెం పడి సర్వే ఊపందుకుందని చెప్పారు. సర్వే పూర్తయితే ప్రభుత్వ పాలన సులభతరమవుతుందని చెప్పారు. తొలుత కుటుంబ పూర్తి వివరాలు నమోదయ్యే దాకా సేవ్ కాకపోవడం సమస్యగా ఉండేదని, ఇపుడు ఆ సమస్యను కూడా అధికమించడం జరిగిందన్నారు. సర్వే వల్ల కార్యాలయాల్లో సిబ్బంది అందుబాటులో లేక పాలన స్తంభిస్తుండడం వాస్తవమేనని, కానీ ఒక నెలపాటు ఆ సమస్యను ఎదుర్కోకతప్పదన్నారు. ఆయన వెంట ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్ధారు రామకృష్ణ, ఏఎస్‌ఓ శ్రీనివాసులు, వీఆర్వో ఉలవపాటి వెంకటేశ్వర్లు, వీఆర్‌ఏలు ఉన్నారు.