‘గౌరవ’ నిరీక్షణ..!
Published Mon, Aug 22 2016 2:41 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM
స్వపరిపాలనలోనూ మారని తీరు
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అందని గౌరవ వేతనం
సింహభాగం అధికార పార్టీ వాళ్లే
డిమాండ్ చేయలేకపోతున్న వైనం
11 నెలలు.. బకాయి రూ.9 కోట్లపైనే..
సాక్షి, మంచిర్యాల : స్థానిక సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వేతన కష్టాలు వచ్చి పడ్డాయి. గత ప్రభుత్వాల మాదిరిగానే.. స్వపరిపాలనలోనూ వారికి గౌరవ వేతనాల కోసం నిరీక్షణ తప్పడం లేదు. పదకొండు నెలల నుంచి గౌరవ వేతనాలందక.. అధికారులను ప్రశ్నించినా ఫలితం లేక.. అటు ప్రభుత్వాన్నీ నిలదీయలేక మదనపడుతున్నారు. ప్రస్తుతం ప్రజాప్రతినిధులంతా.. అధికార పార్టీకి చెందిన వారే ఉండడంతో అధికారులతో విన్నవించుకోవడమే తప్పా.. ప్రభుత్వాన్ని మాత్రం డిమాండ్ చేయలేకపోతున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు మొత్తం 1607 మందికి వేతనాల రూపంలో రూ.9,51,50,000 రావాల్సి ఉంది. గౌరవ వేతనాలు భారీ మొత్తంలో రావాల్సి ఉండడంతో.. ఎప్పుడొస్తాయో...? అసలు వస్తాయో రావో తెలియక ఆందోళన చెందుతున్నారు.
ఈ విషయంలో అధికారుల్లోనూ స్పష్టత లేదు. లోటు బడ్జెట్ అరకొర గౌరవ వేతనాలతో ఆర్థికంగా చితికిపోతున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు పెంచి.. సమాజంలో గౌరవం కల్పించేలా గతేడాది మార్చి 13న.. తెలంగాణ ప్రభుత్వం ఎవరూ ఊహించని విధంగా వేతనాలు పెంచింది. పెంచిన వేతనాలు.. ఏప్రిల్ నుంచి ఇస్తూ వస్తోంది. దీంతో అప్పట్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రకటన అనంతరం.. వరుసగా ఆరు మాసాలపాటు వారికి గౌరవ వేతనాలు ఇచ్చిన ప్రభుత్వం తర్వాత వెనక్కితగ్గింది. లోటు బడ్జెట్ కారణంతో వేతనాలు నిలుపుదల చేసింది. 11 మాసాల నుంచి గౌరవ వేతనాలు చేతికి అందకపోవడంతో ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
వేతనాల్లో జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌కు అత్యధికంగా నెలకు రూ.లక్ష చొప్పున 11 నెలలకు రూ.11లక్షలు అందాల్సి ఉంది. ఒక్కో జెడ్పీటీసీ, ఎంపీపీకి నెలకు రూ.10 వేల చొప్పున 11 నెలలకు రూ.1.10 లక్షలు.. ఎంపీటీసీ, సర్పంచులకు నెలకు రూ.5 వేల చొప్పున 11 మాసాలకు రూ.55 వేల గౌరవ వేతనాలు అందాల్సి ఉంది. అయితే.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లకు మాత్రం రెండు, మూడు నెలలకోసారి గౌరవ వేతనాలు అందుతున్నాయి. ప్రస్తుతం వేతన బకాయిలు లేవు. కానీ.. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలందకపోవడంతో ప్రభుత్వం వివక్ష చూపుతోందనే భావన వారిలో నెలకొంది. వేతనాల పెంపుతో.. ప్రభుత్వంపై ప్రతి నెల రూ.68,30,200 చొప్పున ఏటా రూ.8,19,62,400 భారం పడింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం, ఆర్టీసీ కార్మికులకు 44 వాతం ఫిట్‌మెంట్ ఇస్తుండడం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రభుత్వంపై మోయలేని ఆర్థిక భారం పడి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని ఓ ప్రజాప్రతినిధి చెప్పారు.
గౌరవం ఇచ్చినట్టే ఇచ్చి..
ఏడాదిన్నర క్రితమే ప్రభుత్వం మాకు గౌరవ వేతనాలు భారీగా పెంచింది. అప్పట్లో అందరం సంబరపడ్డాం. ఇకపై ప్రతినెలా పెంచిన వేతనాలు అందుతాయని భావించాం. కానీ ఆ సంతోషం కొన్నాళ్లకే పరిమితమైంది. ఆరు నెలల వరకు గౌరవ వేతనాలిచ్చిన ప్రభుత్వం తర్వాత మమ్ముల్ని మరిచిపోయింది. 11 నెలల నుంచి గౌరవ వేతనాలు అందక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నం.
- అర్కాల హేమలత, ఆవడం సర్పంచ్, నెన్నెల మండలం
Advertisement