'శవాల తెలంగాణగా మార్చారు' | revanth reddy fire on cm kcr | Sakshi
Sakshi News home page

'శవాల తెలంగాణగా మార్చారు'

Published Tue, Nov 17 2015 7:58 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

'శవాల తెలంగాణగా మార్చారు' - Sakshi

'శవాల తెలంగాణగా మార్చారు'

హన్మకొండ: బంగారు తెలంగాణ అంటూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని శవాల తెలంగాణగా మార్చారని టీడీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనా వైఫల్యం వల్లే 1,800 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన పీజీ విద్యార్థిని శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిని కిరాతకంగా హింసించి చంపారని ఆరోపించారు. తమది నక్సలైట్ల ఎజెండా అని కేసీఆర్ చెపుతున్నారని, దాన్ని నక్సలైట్లే వ్యతిరేకించారని గుర్తు చేశారు. కుటుంబంలో నలుగురికి పదవులు కట్టబెట్టాలని నక్సలైట్ల ఎజెండాలో ఉందా? అని ప్రశ్నించారు.

పత్తికి మద్దతు ధర కల్పించాలని ప్రశ్నిస్తే కొమురయ్య అనే రైతును జైలులో పెట్టారని, మరి ఆ రైతును బహిరంగంగా దూషించి అవమానపరిచిన కడియం శ్రీహరిపై ఎందుకు కేసు పెట్టలేదని నిలదీశారు. కడియంకు చేసిన ‘సన్మానమే’ కేసీఆర్‌కూ జరగాలన్నారు. సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించిన వారిని టీడీపీ, బీజేపీ అభినందిస్తున్నాయని చెప్పారు. విద్యార్థులు, ఉద్యోగులు కూడా టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలంటే 1956కు ముందు తెలంగాణలో జన్మించినవారు అయి ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్... ఆంధ్రా కాంట్రాక్టర్లు కూడా 1956 ముందు పుట్టినోళ్లకు టెండర్లు ఇస్తామని ఎందుకు నిబంధన పెట్టలేదని ప్రశ్నించారు.

కమీషన్‌లు వచ్చే విషయంలో నిబంధనలు ఉండవని ఎద్దేవా చేశారు. రైతు సమస్యలపై కోదండరాం వేసిన పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించినందున ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వం వద్దకు రైతుల సమస్యలు తీసుకెళ్లి, ఆత్మహత్యలు నివారించాలని కోరినా పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement