రూ.62.50 లక్షల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
చిల్లకూరు: చీరల మాటున తరలిస్తున్న రూ.62.50 లక్షల గుట్కా ప్యాకెట్లను నెల్లూరు విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ ఎస్పీ శ్రీకంఠనాథ్‌రెడ్డి నేతృత్వంలో అధికారులు, సిబ్బంది మంగళవారం బూదనం టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బెంగుళూరు నుంచి కలకత్తా వెళుతున్న ఓ కంటైనర్‌ను నిలిపి తనిఖీలు చేపట్టారు. అందులో చీరల మూటలు కన్పించాయి. వదిలేయాలనుకుంటున్న సమయంలో గుట్కా వాసన గుప్పుమంది. దీంతో వాహనంలోకి ఎక్కి చీరల మూటలను పక్కకు తొలగించి చూడగా భారీస్థాయిలో నిషేధిత గుట్కా బస్తాలు దర్శనమిచ్చాయి.
వాహనాన్ని స్వాధీనం చేసుకొని నెల్లూరులోని విజిలెన్స్ కార్యాలయానికి తరలించారు. కంటైనర్‌లో 50కిలోల వంతున 50బస్తాల గుట్కాను గుర్తించారు. వాటివిలువ బ హిరంగ మార్కెట్‌లో సుమారు రూ. 62.50లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇదిలాఉండగా ఓవర్‌లోడ్, బిల్లులు లేకుండా వెళుతున్న సిలికా, బొగ్గు, రోడ్ మెటల్, టాక్స్ ఎగవేసిన 12లారీలను పట్టుకొని రూ.1,32,500 జరిమానా విధించినట్లు ఎస్పీ శ్రీకంఠనాథ్‌రెడ్డి చెప్పారు. మైనింగ్ రవాణాకు సంబంధించిన లారీలను జరిమానా విధించేందుకు సంబంధిత అ«ధికారులకు అప్పగించామని చెప్పారు. అక్రమాలపై ప్రజలు నేరుగా తమకు సమాచారం అందిస్తే తగిన రీతిలో స్పందిస్తామన్నారు. మంగళవారం నాటి దాడుల్లో డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌లు కట్టా శ్రీనివాసరావు, ఆంజనేయరెడ్డి, డీసీటీవో రవికుమార్, విష్ణు, ఏజీ రాము, ఉమామహేశ్వరరావు, వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.