మార్చిలో వచ్చిన రూ. 8,73,696 విద్యుత్ బిల్లును చూపిస్తున్న రవీంద్ర
తోటపల్లిగూడూరు (సర్వేపల్లి): ఒక్క బల్బుకు కరెంటు వాడితే బిల్లు ఎంతో తెలుసా.. అక్షరాలా రూ.8.73 లక్షలు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ బిల్లు అందుకున్న వినియోగదారుడు షాక్‌కు గురయ్యాడు. ఈ బిల్లు చూపించి అధికారుల్ని అడిగితే.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోమని సలహా ఇచ్చారు. దీంతో వినియోగదారుడికి దిక్కుతోచడంలేదు. తోటపల్లిగూడూరు మండలం నరుకూరు తొట్టి ప్రాంతానికి చెందిన వేగూరు రవీంద్ర పక్కాగృహం నిర్మించుకుంటున్నాడు.
మూడు నెలల కిందట ఆ ఇంటికి కొత్త మీటర్ బిగించుకుని, ఒక బల్బు వినియోగిస్తున్నాడు. దీనికి జనవరిలో రూ.85, ఫిబ్రవరిలో రూ.87 బిల్లులొచ్చాయి. ఫిబ్రవరిలో వాడకానికి సంబంధించి ఈనెలలో ఇచ్చిన బిల్లు మాత్రం లక్షలైంది. 1,26,517 యూనిట్లు వాడినట్లుగా లెక్కలు వేసి రూ.8,73,696 బిల్లును ట్రాన్స్‌కో అధికారులు వినియోగదారుడికి అందించారు. ఈ బిల్లు చూసి కంగుతిన్న బాధితుడు స్థానిక ట్రాన్స్‌కో అధికారులతో తన గోడును వెళ్లబోసుకుంటే తామేమీ చేయలేమని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు. దీంతో బాధితుడు గొల్లుమంటున్నాడు.