సదస్సులో మాట్లాడుతున్న కేంద్ర సమాచార కమిషనర్ శ్రీధర్
కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్
బాలాజీచెరువు (కాకినాడ) :
సమాచార హక్కు చట్టంపై విద్యార్థి దశలోనే అవగాహన కలిగి ఉండాలని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. జిల్లా సమాచార ఐక్యప్రచార వేదిక మహిళా విభాగం ఆధ్వర్యాన ‘సమాచార హక్కు చట్టంతో మహిళా సాధికారత’ అనే అంశంపై జేఎన్‌టీయూకేలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజా శ్రేయస్సు కోసం ఈ చటాన్ని రూపొందించారని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ చట్టం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల్లో పారదర్శకతతోపాటు అధికారులను ప్రశ్నించే హక్కు పౌరులకు వచ్చిందన్నారు. ఈ చట్టాన్ని ప్రజాహితం కోసం వినియోగించాలని కోరారు. మహిళలకు అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని, తద్వారా సమాచార హక్కు చట్టంలో వారికి ఉన్న హక్కులు తెలుస్తాయని చెప్పారు. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయబోమని ఐక్యప్రచార వేదిక సభ్యులతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూకే రిజిస్ట్రార్ ప్రసాద్‌రాజు, వేదిక మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాళం ఆండాళ్ తదితరులు పాల్గొన్నారు.