
పాతికేళ్ల నుంచి అమలు
బ్రహ్మసముద్రం : మండలంలోని పాలవెంకటాపురం గ్రామస్తులు వన సంరక్షణలో ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామ సమీపంలోని కొండపై 25 సంవత్సరాల క్రితం విత్తనాలు వెదజల్లి... పెరిగిన మొక్కలు, చెట్లను కొట్టకుండా కాపాడుకుంటున్నారు. విత్తనాలు వెదజల్లిన రోజునే కొండపై చెట్లను నరకరాదన్న నిబంధనను వారు ఏర్పాటు చేసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు అప్పటి గ్రామ పెద్దలు ఓ కమిటీగా ఏర్పడ్డారు.
ఇప్పటి వరకూ ఆ నిబంధనను అతిక్రమించకపోవడంతో కొండపై వేలాది చెట్లు పెరిగాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఆర్డీటీ సంస్థ ప్రతినిధులు... గ్రామస్తులను ప్రోత్సహిస్తూ 1,500 ఎకరాల్లో మామిడి తోటల పెంపకం, డ్రిప్ పరికరాల మంజూరుకు చేయూతనిచ్చారు.