తూకంలో దగా.. | Rules adopted by traders | Sakshi
Sakshi News home page

తూకంలో దగా..

Published Tue, Jan 10 2017 10:47 PM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM

Rules adopted by traders

నిబంధనలు పాటించని వ్యాపారులు
వినియోగదారుల జేబులకు చిల్లు
‘మామూలు’గా తీసుకుంటున్న తూనికలు, కొలతల అధికారులు


మంచిర్యాలలోని మజీద్‌వాడకు చెందిన ఓ చిరు వ్యాపారి.. హోల్‌సెల్‌ దుకాణంలో ఈ మధ్య క్వింటాల్‌ బియ్యం, 5 కిలోల పెసరపప్పు, 5 లీటర్ల పల్లి నూనె (టిన్‌), 5 కిలోల ఉల్లిగడ్డలు, 5 కిలోల పంచదార, 5 కిలోల గోధుమలు ఇలా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసింది. ఇంటికి వచ్చాక తమ కిరాణం షాపులో ఉన్న కాంటాలో తూకం వేసి పరిశీలించగా.. 5 కిలోలు కొనుగోలు చేసిన పంచదార నాలుగు కిలోలే వచ్చింది. ఈ విషయమై జిల్లా కేంద్రంలోని తూనికలు, కొలతల అధికారికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వారం రోజుల క్రితం కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేస్తుండగా ఆ వ్యాపారి తూనికలు వేసేందుకు రాళ్లను వినియోగించాడు. దీంతో ఆ మహిళ సదరు వ్యాపారిని ప్రశ్నించింది. దీంతో ‘నీ ఇష్టం ఉంటే కొను. లేకుంటే లేదు’ అంటూ వ్యాపారి సమాధానం ఇచ్చాడు. ఎవరి దగ్గరికెళ్లినా ఈ బండ రాళ్లే కనిపిస్తాయని చెప్పడం విడ్డూరం.

మంచిర్యాల క్రైం : జిల్లాలో సరుకుల కొనుగోలు చేస్తున్న వినియోగదారులు పలుచోట్ల తూనికల్లో భారీగా మోసపోతున్నారు. కిరాణం, రేషన్, పండ్లు, కిరోసిన్‌ దుకాణాల్లో తూకాల్లో మోసాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే విధంగా.. బియ్యం వ్యాపారులు కూడా 50 కిలోల బ్యాగులో ఒకటి నుంచి రెండు కిలోలు తక్కువగా తూకం వేస్తున్నారు. వీటికితోడు పెట్రోల్, డీజిల్‌ కొలతల్లోనూ నిత్యం మోసాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిపై తూనికలు, కొలతల అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. అడపాదడపా దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘మామూలు’గా తీసుకుంటున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

కానరాని చట్టాలు..
తూనికల కొలతల్లో వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు రూపొందించిన  చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. ఎవరికైనా తూకంలో తేడా వస్తే ఫిర్యాదు  చేస్తే అధికారులు తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి జేబులు నింపుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఫలితంగా వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు.

ఎలక్ట్రానిక్‌ కాంటాలు..
మారుతున్న కాలంలో ప్రతి దుకాణంలో ఎలక్ట్రానిక్‌ కాంటాలు వాడుతున్నారు. ఈ కాంటాలో మోసం జరుగుతూనే ఉంది. కాంటాలో కేజీలకు బదులు మిల్లీమీటర్లలో తేడా వచ్చే అవకాశం ఉందని కొంతమంది చెప్తున్నారు. కాంటాలో సాంకేతిక తేడాలు రావడంతో వినియోగదారులు భారీగా నస్టపోతున్నారు.

నిబంధనలు బేఖాతర్‌..
నిబంధలనల ప్రకారం ప్రతి ఏడాడి వ్యాపారులు వారివారి కాంటాలను సంబంధిత తూనికలు, కొలతల శాఖ కార్యాలయానికి తీసువెళ్లి అధికారులతో తనిఖీ చేయించి వాటిపై ముద్ర వేయించాలి. కానీ.. వ్యాపారులు మాత్రం ఏళ్ల వరకు తనిఖీలు చేయించుకోకుండానే యథేచ్‌చగా వ్యాపారం సాగిస్తున్నారు. కిలోబాటు ఏడాదికి 50  గ్రాముల వరకు అరుగుదల ఉంటుంది. కానీ.. వ్యాపారులు పట్టించుకోవడంలేదు. దీంతో కిలోకు తూకంలో 50 గ్రాముల తేడా వస్తుంది. ఈ రకంగా వినియోగదారులు పెద్దఎత్తున ఆర్థికంగా నష్టపోతున్నారు. అంతేకాక కొంతమంది వ్యాపారులు వివిధ రకాల వస్తువులను ముందుగానే ప్యాక్‌ చేసి విక్రయిస్తున్నారు. ఆ ప్యాకింగ్‌ కవర్లపై తయారీ తేదీ, కంపెనీ వివరాలు పొందుపరచడం లేదు. ఇప్పటికైనా అధికారులు తూకంలో జరిగే మోసాలను అరికట్టి వినియోగదారులు ఆర్థికంగా నష్టపోకుండా చూడాలని కోరుతున్నారు.

జిల్లాలో మూడు సంవత్సరాలుగా నమోదై కేసులు, వచ్చిన ఆదాయం..
2014లో..

కాంటాలకు, బాట్లకు ముద్ర వేయగా వచ్చిన ఆదాయం రూ.6,54,410
దుకాణలపై దాడి చేయగా రాజీకి వచ్చి జరిమానాతో కలిపి ముద్ర వేయగా వచ్చిన ఆదాయం రూ.6,76,600
బాట్లపై ముద్ర లేకపోవడంతో చేసిన కేసులు 146
వస్తువులపై ఎమ్మార్పీ రేటు, సరైన చిరునామా లేకపోవడంతో నమోదు చేసిన కేసులు 120

2015లో..
కాంటాలకు, బాట్లకు ముద్ర వేయగా వచ్చిన ఆదాయం రూ.6,60,190
దుకాణలపై దాడి చేయగా రాజీకి వచ్చి జరిమానాతో కలిపి ముద్ర వేయగా వచ్చిన ఆదాయం రూ.5,10,600
బాట్లపై ముద్ర లేకపోవడంతో చేసిన కేసులు  92
వస్తువులపై ఎమ్మార్పీ రేటు, సరైన చిరునామా లేకపోవడంతో నమోదు చేసిన కేసులు  101

2016లో..
కాంటాలకు, బాట్లకు ముద్ర వేయగా వచ్చిన ఆదాయం రూ.7,20,630
దుకాణాలపై దాడి చేయగా రాజీకి వచ్చి జరిమానాతో కలిపి ముద్ర వేయగా వచ్చిన ఆదాయం రూ.5,40,300
బాట్లపై ముద్ర లేకపోవడంతో చేసిన కేసులు 102
వస్తువులపై ఎమ్మార్పీ రేటు, సరైన చిరునామా లేక పోవడంతో నమోదు చేసిన కేసులు  70

సమాచారం ఇస్తే చర్యలు
కిరాణం షాపులు, కూరగాల దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నాం. గడిచిన సంవత్సరం 172 కేసులు నమోదు చేశాం. కొన్ని దుకాణాలలో ఎలాంటి అడ్రస్‌ లేకుండా, వాటిపై ఎమ్మార్పీ రేటు లేకుండా అమ్ముతున్నారు. వినియోగదారులు సైతం అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వస్తువులను కొనుగోలు చేయరాదు. తూనికలు, కొలతల్లో అనుమానం కలిగితే సమాచారం ఇవ్వాలి. వారిపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు ఎవరూ సమాచారం ఇవ్వలేదు. నిర్భయంగా 9849430056 నెంబర్‌కు ఫోన్‌ చేయొచ్చు. వారి పేర్లు వెల్లడించం.
– ఎండీ రియాజ్‌హైమద్‌ఖాన్, జిల్లా తూనికలు,కొలతల అధికారి, మంచిర్యాల
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement