
పర్సంటేజీల కోసం నిబంధనలకు పాతర
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నీరు–చెట్టు, ఓఅండ్‌ఎం, ఎఫ్‌డీఆర్, తదితర పనుల్లో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరిగేషన్ శాఖ అధికారులు తాజాగా నీటి వినియోగదారుల సంఘం నిబంధనలను తుంగలో తొక్కారు.
నీరు–చెట్టు, ఎఫ్‌డీఆర్, తదితర పనుల్లో అక్రమాలకు పాల్పడడంపై హైకోర్టు మెట్టికాయలు వేసినా ఇరిగేషన్ అధికారుల తీరులో మార్పు రావడం లేదు. పర్సంటేజీల కోసం నీటి వినియోగదారుల సంఘం నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. నీటి వినియోగదారుల సంఘాల పరిధిలోని బ్యాంకు ఖాతాలను మూసివేసి కొత్తగా తెరిచి లక్షలాది రూపాయలు స్వాహా చేస్తున్నారు.నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నీరు–చెట్టు, ఓఅండ్‌ఎం, ఎఫ్‌డీఆర్, తదితర పనుల్లో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరిగేషన్ శాఖ అధికారులు తాజాగా నీటి వినియోగదారుల సంఘం నిబంధనలను తుంగలో తొక్కారు. నీటి సంఘాల పరిధిలోని బ్యాంకు ఖాతాలను మూసివేసి కొత్తగా ఖాతాలను తెరచి లక్షలాది రూపాయల నగదును స్వాహా చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో జరిగిన అక్రమాలపై వివిధ కోణాల్లో దర్యాప్తులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బిల్లులను ఎలాగైనా పాస్ చేయించుకోవాలని ఇంజనీర్లు పథకం పన్నారు. నీటి సంఘాల పరిధిలోని ఖాతాలను వదిలేసి కొత్త ఖాతాలను తెరిచి నగదు జమ చేశారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఒక్క రోజులోనే రూ.70లక్షలు చెల్లింపులు జరిపినట్లు సమాచారం. ఈ మొత్తానికి గానూ బ్యాంకు వద్దనే ఇంజనీర్లు తమ పర్సంటే జ్æలను జేబులో వేసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై ఆరాతీసిన రైతు సంఘాల నాయకులకు కళ్లు బైర్లు కమ్మాయి.ఇవీ నిబంధనలు
- నీటి వినియోగదారుల సంఘం చట్టప్రకారం ఆ సంఘం పరిధిలోని బ్యాంకుల్లోనే ఉమ్మడి కరెంట్ ఖాతాలు ఉండాలి.
- నీటి వినియోగదారుల సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఇద్దరి సంతకాలతోనే లావాదేవీలు జరపాలి.
- బ్యాంక్ ఖాతా తెరిచే ముందుగా సంబంధిత ఇరిగేషన్ అధికారులు అనుమతి తీసుకోవాలి.
- నీటి వినియోగదారుల సంఘం నిబంధనలను అనుసరించే ఏఈ, డీఈలు ఖాతా తెరిచేందుకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.
నిబంధనలకు తూట్లుకోవూరు నియోజకవర్గ పరిధిలో నీటిని వినియోగదారుల సంఘ నిబంధనలకు ఇరిగేషన్ అధికారులు, టీడీపీ నాయకులు పాతర వేశారు. కొడవలూరు, కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరులో ఉన్న ఉమ్మడి కరెంట్ ఖాతాల్లో నిధులను జమ చేయలేదు. నెల్లూరు నగరంలోని దర్గామిట్ట బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో సుమారు 56కుపైగా కొత్త ఖాతాలను తెరిచి ఉమ్మడి సంతకాలకు బదులు ఒక్క సంతకంతోనే నిధులను డ్రా చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మౌఖిక ఆదేశాల ప్రకారం ఖాతాలు తెరవడాన్ని వారు తప్పుబడుతున్నారు. చట్టం ప్రకారం రెండు సంతకాలు లేకుండా చెక్కులను డ్రా చేయడం వెనుక ఉన్న రాజకీయ వత్తాసును ప్రశ్నిస్తున్నారు. పర్సంటేజ్‌ల కోసం ఈఈ మొండిగా వ్యవహరిస్తున్నారని, తన వాటా తనకు ఇస్తేగానీ బిల్లులు చేయనని భీష్మించుకుని కూర్చున్న ఏఈపై అధికార పార్టీ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులను స్వాహా చేసేందుకు కొత్తగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతాలు తెరవడంలో ఎమ్మెల్యే అనుచరులు రామన్నపాళెం అధ్యక్షుడు, జొన్నవాడ దేవస్థానం మాజీ ట్రస్టీ, కోవూరు మండల నీటి సంఘం అధ్యక్షుల ప్రధాన పాత్ర ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. పర్సంటేజీల కోసం నిబంధనలకు వ్యతిరేకంగా కొత్త ఖాతాలను తెరచేందుకు ఏఈ సైతం ఉత్సాహం చూపడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. కలెక్టర్, పోలీసు, ఇరిగేషన్‌శాఖ అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి సివిల్, క్రిమినల్ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.నిబంధనలను ఉల్లంఘనపై ఫిర్యాదులు అందాయి – ఎస్‌ఈ వీ కోటేశ్వరరావునీటి వినియోగదారుల సంఘం నిబంధనలను ఉల్లంఘించి సంఘాల పరిధిలో లేని బ్యాంకుల్లో ఖాతాలను తెరిచినట్లు ఫిర్యాదులు అందాయి. విచారణ జరుపుతున్నాం. నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై కఠినచర్యలు తీసుకుంటాం.