పీఆర్ కండ్రిగకు నేడు సచిన్ రాక
-
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ముత్యాలరాజు
-
అన్ని శాఖల అధికారులతో సమావేశం
గూడూరు:
రాజ్యసభ సభ్యుడు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బుధవారం ఆయన దత్తత గ్రామమైన గూడూరు రూరల్ పరిధిలోని పుట్టమరాజువారి కండ్రిగకు రానున్నారు. ఈ మేరకు ఆ గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ ముత్యాలరాజు ఇతర అధికారులతో కలసి మంగళవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ చెన్నై విమానాశ్రయం నుంచి సచిన్ ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో ఉదయం 11.30 గంటలకు గూడూరు-తిరుపతి రహదారి పక్కనే చెమిర్తి రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారన్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా గ్రామంలో నూతనంగా ఏర్పాటైన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం రెండేళ్ల క్రితం తాను కలుసుకున్న గోపాలయ్య, విజయమ్మల కుటుంబ సభ్యులతో వారి ఇంటి వద్దకే వెళ్లి మాట్లాడుతారన్నారు. పక్కనే ఉన్న పాఠశాల్లోని విద్యార్థులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తారని తెలిపారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసి ఉన్న సభా స్థలికి చేరుకుంటారన్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ 12.55 గంటలకు పూర్తి చేసుకుని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారని తెలిపారు. ఆయన వెంట జేసీ ఇంతియాజ్, ఆర్డీఓ వెంకటసుబ్బయ్య, తహసీల్దార్ సత్యవతి తదితరులున్నారు.
భద్రతా ఏర్పాట్ల పరిశీలన
గూడూరు రూరల్ పరిధిలోని పుట్టమరాజువారికండ్రిగలో సచిన్ టెండూల్కర్ బుధవారం పర్యటించనున్న నేపథ్యంలో ఽభద్రతా ఏర్పాట్లను డీఎస్పీ శ్రీనివాస్‌తోపాటు ఏఆర్ డీఎస్పీ చెంచురెడ్డి, ఎస్‌బీ డీఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ ఈ పర్యటనలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా బారికేడ్స్‌ను ఏర్పాటు చేస్తారన్నారు. నలుగురు డీఎస్పీలు, 9 మంది సీఐలతోపాటు పలువురు ఎస్సైలు, పోలీస్ కానిస్టేబుళ్లను ఏర్పాటు చేస్తూ పఠిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వారి వెంట రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై బాబి ఉన్నారు.