
ఆత్మహత్య చేసుకోవాలని సారికను ఒత్తిడి చేశారు!
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలది ఆత్మహత్యేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో సారిక, ఆమె పిల్లలు ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. దీనిపై ముమ్మరంగా దర్యాప్తు చేసిన వరంగల్ పోలీసులు.. రిమాండు రిపోర్టును సిద్ధం చేశారు. ఇందుకోసం మొత్తం 24 మందిని ప్రశ్నించారు.
రాజయ్య కుమారుడు అనిల్, కోడలు సారికల వైవాహిక జీవితం గురించి కూడా రిమాండు రిపోర్టులో పేర్కొన్నారు. అనిల్ రెండో భార్య సన మాత్రం తప్పించుకుని తిరుగుతోందని తెలిపారు. కాగా, ఈ కేసులో ఎ1 అనిల్, ఎ2 సిరిసిల్ల రాజయ్య, ఎ3 మాధవీలత, ఎ4 సన అని పేర్కొన్నారు.
రిమాండు రిపోర్టులో మరిన్ని విభ్రాంతికర వాస్తవాలను పోలీసులు బయటపెట్టారు. అవి ఇలా ఉన్నాయి...
- అనిల్ రెండో వివాహంతోనే సారికపై వేధింపులు మొదలయ్యాయి
- అనిల్‌కు తల్లిదండ్రుల మద్దతు ఉంది
- సారికను మామ రాజయ్య, అత్త మాధవీలత వేధించారు
- ఆమె పలుమార్లు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది
- కేసుల కారణంగా సారికపై వేధింపులు మరింతగా పెరిగాయి
- కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని నిరంతరం వేధించారు
- ఆత్మహత్య చేసుకోవాలంటూ ఒత్తిడి చేశారు
- ఇంట్లో పనివాళ్లు, డ్రైవర్లు ఈ వేధింపులకు సాక్షులు
- సారిక, పిల్లలను అత్తింటివారు ఒంటరి చేశారు
- ఉప ఎన్నికల్లో రాజయ్య గెలిస్తే వేధింపులు పెరుగుతాయని సారిక భయపడింది
- పలుకుబడి ఉపయోగించి వేధిస్తారని ఆందోళన చెందింది
- విసిగిపోయి పిల్లలతో ఆత్మహత్యకు ఒడిగట్టింది
- తెల్లవారుజామున 4-4.30 మధ్య ఆత్మహత్యకు పాల్పడింది
- పొగలు రావడంతో చుట్టుపక్కల వాళ్లు గుర్తించి 100, 108లకు సమాచారం ఇచ్చారు.
- ఆ ఇంటి బెడ్రూంలో రెండు గ్యాస్ సిలిండర్లున్నాయి
- ఒకటి ఖాళీ, మరోటి నిండుది.
- మంటలు, పొగ కారణగానే సారిక, పిల్లలు మరణించారు
బెయిల్ దరఖాస్తు
కాగా, శనివారం వరంగల్ కోర్టులో రాజయ్య, ఆయన భార్య మాధవి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సంఘటన జరిగిన ఇంట్లో తాము ఉండటం లేదని, ఎన్నికల నేపథ్యంలోనే తాము ఒక రోజు ముందుగా అక్కడికి వచ్చామని అందులో పేర్కొన్నారు. అందువల్లే ఈ ఘటనతో తమకు ఎటువంటి సంబంధం లేదని, తమకు బెయిల్ ఇవ్వాలని అందులో కోరారు. వారి పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం దానిపై విచారణను ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది.