
మరో మహిళా తహశీల్దార్‌పై దాడికి యత్నం
కులం పేరుతో మహిళా తహశీల్దార్‌ను దూషించి, దాడికి యత్నించినందుకు టీడీపీ నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదైంది.
చిన్నగొట్టికల్లు (చిత్తూరు జిల్లా): కులం పేరుతో మహిళా తహశీల్దార్‌ను దూషించి, దాడికి యత్నించినందుకు టీడీపీ నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక కేసు నమోదైంది. ఈ ఘటన శుక్రవారం చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు మండలం రంగన్నగారిగడ్డ గ్రామంలో జరిగింది. చిన్నగొట్టికల్లు మండల తహశీల్దార్ నారాయణమ్మ ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగన్నగారిగడ్డ గ్రామంలో ఆక్రమణకు గురైన చెరువు భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లారు.
అయితే టీడీపీ బలపరిచిన ఆ గ్రామ సర్పంచ్ రమణారెడ్డి చెరువు వద్దకు చేరుకొని తహశీల్దార్ నారాయణమ్మను కులం పేరుతో దూషించి, దాడికి యత్నించి భూముల స్వాధీన కార్యక్రమాన్ని అడ్డుకున్నాడు. దీంతో నారాయణమ్మ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ విషయంపై సర్పంచ్ రమణారెడ్డిని వివరణ కోరగా తాను ఎలాంటి తప్పు చేయలేదని, కులం పేరుతో దూషించలేదని, దాడికి పాల్పడలేదని చెప్పాడు.