వాసు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్సీ గేయానంద్
పాటల ‘సెమట సుక్క’కు కన్నీటి వీడ్కోలు
Published Mon, Oct 3 2016 11:16 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
– ప్రజా కవి వాసు అంతిమయాత్రకు తరలివచ్చిన కళాకారులు
– గఫూర్, గేయానంద్ తదితరులు నివాళులు
కర్నూలు(కల్చరల్): పాటవై మళ్లీ వస్తావా..! మా వాసన్న..!.. పోరు బాటకు తోడై ఉంటావా.. మా వాసన్న..! సెమట సుక్కవై నింగికెగిసావా.. మా వాసన్న..! అంటూ ప్రజా కవి ఆర్‌ఏ వాసుకు ప్రజానాట్య మండలి కళాకారులు నివాళులు అర్పిస్తూ పాడిన గీతం అందరినీ కంటతడి పెట్టించింది. స్థానిక సీపీఎం కార్యాలయ ఆవరణలో వాసు భౌతిక కాయాన్ని ఉంచి సీపీఎం నాయకులు, ప్రజా కళాకారులు, కవులు, గాయకులు నివాళులు అర్పించారు. అంతకుముందు స్థానిక మార్కెట్‌యార్డు సమీపంలోని ఇందిరాగాంధీ నగర్‌లో వాసు స్వగృహం వద్ద ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్, ఎమ్మెల్సీ గేయానంద్, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మల, ప్రజావైద్యశాల డైరెక్టర్ డా.బ్రహ్మారెడ్డి, డా.వీవీ లక్ష్మీనారాయణ, లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కార్యదర్శి, గాయకుడు మహమ్మద్‌మియా, సహాయ కార్యదర్శి, రచయిత ఇనాయతుల్లా, కోశాధికారి బాల వెంకటేశ్వర్లు, టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు, విశ్వకళాసమితి అధ్యక్షుడు హనుమంతరాయచౌదరి, రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం నాయకుడు చంద్రన్న, ఆర్కెస్ట్రా కళాకారుల సంక్షేమ సంఘం నాయకులు సుధారాణి, చంద్రకంటి మద్దయ్య, రవీంద్ర విద్యాసంస్థల డైరెక్టర్ పుల్లయ్య, తదితరులు నివాళులు అర్పించారు. అంతిమయాత్రలో పేదల గాయకుడు వాసు అమర్ రహే, జోహార్.. జోహార్.. వాసు ఆశయాలు కొనసాగిస్తాం.. అనే నినాదాలు మార్మోగాయి. వాసు సతీమణి సుజాత, కుమార్తెలు లహరి, వెన్నెలను పలువురు పరామర్శించారు. స్థానిక సుంకేసుల రోడ్డులోని క్రై స్తవ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
పాటల కెరటం వాసు:
పేద ప్రజల కష్టాలను ప్రజా కవి వాసు సమీపం నుంచి పరిశీలిస్తూ దుర్భరమైన జీవనాన్ని గడుపుతున్న శ్రమజీవులు, హమాలీలు, కూలీల జీవితాలను వాసు అక్షరీకరించి పాటల కెరటమై నిలిచారని ఎమ్మెల్సీ గేయానంద్ అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయ ఆవరణంలో వాసు భౌతికకాయానికి నివాళులు అర్పిస్తూ ఆయన సంతాప సందేశాన్ని అందించారు. వాసు ఆశయాలను కళాకారులు, కార్యకర్తలు కొనసాగించాలన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు షడ్రక్ మాట్లాడుతూ వాసు తన జీవితాన్ని పాటలకే అంకితం చేసి ప్రజల్ని చైతన్యపరిచారన్నారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ పేదరికంపై, అణచివేతపై వాసు రాజీలేని పోరాటం చేశారన్నారు. తన పదునైన పాటలతో ప్రస్తుత రాజకీయ వ్యవస్థను తూర్పారబట్టారన్నారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు విజయకుమార్, క్రాంతి, తెలంగాణా ప్రజానాట్య మండలి నాయకులు జగ్గరాజు, నరసింహా, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జి.ఓబులు, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్, సీఐటీయూ నాయకులు పుల్లారెడ్డి, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దిలేటి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోరంట్లప్ప, వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ మద్దయ్య, కర్నూలు ప్రజానాట్య మండలి కార్యదర్శి బసవరాజు, గాయకులు ఆశన్న, కళాకారులు లోకేష్, కరుణాకర్, సీపీఎం కార్యకర్తలు, డప్పు కళాకారులు అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. పాల్గొన్నారు.
Advertisement
Advertisement