ఓటర్ల జాబితాపై నివేదిక పంపండి
– ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశం
– అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
అనంతపురం అర్బన్ : పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదుల్ని త్వరిగతిన పరిష్కరించి నివేదిక పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భన్వర్‌లాల్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలకు సంబం«ధించిన ఫ్లెక్సీలు, పోస్టర్లు తొలగించాలన్నారు. పార్టీలు, అభ్యర్థులు హోర్డింగ్‌లు ఏర్పాటుకు స్థానిక సంస్థలు, మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. పోలింగ్ సిబ్బంది నియామకాలకు సంబంధించిన ర్యాండమైజేషన్ సాఫ్ట్‌వేర్‌ని బుధవారం విడుదల చేస్తామన్నారు.
కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓటర్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి, ఆర్‌డీఓలు రామారావు, రామ్మూర్తి, మలోలా, బాలానాయక్, వెంకటేశం, ఎన్నికల విభాగం డీటీ భాస్కర నారాయణ పాల్గొన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి : ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల కౌంటింగ్‌ని జేఎన్‌టీయూ సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించనున్న గదులను, బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ శనివారం పరిశీలించారు. కౌంటింగ్ హాళ్లలో చేయాల్సిన ఏర్పాట్లపై సూచనలిచ్చారు. ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జేసీ, డీఆర్‌ఓ, ఆర్‌డీఓను ఆదేశించారు.