
చంద్రబాబుతో వెంకటేశ్వర్లు (ఫైల్)
ఫేస్‌బుక్‌తో వెలుగులోకి..
నెల్లూరు(టాస్క్‌ఫోర్సు): నెల్లూరు జిల్లాలో వరుస హత్యలతో హడలెత్తించిన నరహంతకుడు కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు వీరాభిమాని అని వెల్లడైంది. నెల్లూరు జిల్లాలోని యర్రబొట్లపల్లి గ్రామానికి చెందిన ఈ కరుడు గట్టిన నేరస్తుడు ఇళ్లలోకి చొరబడి మహిళల్ని, వృద్ధులను సుత్తితో మోది క్రూరంగా హత్యలకు పాల్పడడం తెలిసిందే.
తాజాగా నెల్లూరు చిల్డ్రన్స్‌పార్కు సమీపంలో ప్రభావతి అనే మహిళ ఇంట్లో చొరబడి సుత్తితో ఆమెపైన, ఆమె బంధులిద్దరిపైన దాడిచేసి.. బంగారు నగలను అపహరించుకొని వెళుతూ పట్టుబడ్డాడు. దీంతో అతని వివరాలు వెల్లడయ్యాయి. టీడీపీలో చురుగ్గా పనిచేసిన విషయం వెలుగులోకి వచ్చింది. గత ఎన్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నేత, నేటి సీఎం చంద్రబాబునాయుడుతో కలసి పాదయాత్రలో సైతం వెంకటేశ్వర్లు పాల్గొన్నాడు. పాదయాత్రలో చంద్రబాబుతో కలసి నడుముకు పచ్చకండువా కట్టుకొని నడిచాడు. ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు.
వెంకటేశ్వర్లు అరెస్ట్ అనంతరం నెల్లూరు పోలీసులు అతని ఫేస్‌బుక్ ఖాతాను గుర్తించారు. దాన్ని చూడగా టీడీపీ పట్ల అతనికెంత అభిమానముందో అవగతమైంది. దీం తో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఇది జరిగిన గంట వ్యవధిలోనే వెంకటేశ్వర్లు ఫేస్‌బుక్ అకౌంట్ అంతర్జాలంలో మాయమైంది. ఇప్పుడీ విషయం అందరికీ తెలియడంతో చర్చనీయాంశంగా మారింది.