
సింగూరు ఎత్తిపోతల పనులను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు(ఫైల్)
- దివంగత నేత వైఎస్ హయాంలో 50 శాతం ప్రాజెక్టు పూర్తి
- రూ.50 కోట్లకు పైగా ఖర్చు చేసిన కేసీఆర్ సర్కార్
- 40 వేల ఎకరాలకు సాగు నీరు.. నేడు ప్రారంభం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మూడు దశాబ్దాల మెతుకుసీమ రైతాంగం ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. వైఎస్‌ఆర్ జలయజ్ఞంతో పునాదులు వేసుకున్న సింగూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నేడు 40 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వబోతోంది. శుక్రవారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మెదక్ జిల్లా సింగూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఒకేసారి 4 పంపులు ప్రారంభించి 450 క్యుసెక్కుల సాగు జలాలను వదిలి దిగువన 47 చెరువులను నింపుతారు. అక్కడి నుంచి పొలాలకు విడుదల చేస్తారు.
2005లో వైఎస్‌ఆర్ అంకురార్పణ
2005లో వైఎస్‌ఆర్ సింగూర్ ఎత్తిపోతల పథకానికి బీజం వేశారు. 139 ఉత్తర్వుల ద్వారా రూ.89.98 కోట్ల అంచనా వ్యయాన్ని నిర్థారిస్తూ జీఓ నెంబర్ 136 జారీ చేశారు. 2006 జూన్ 7 తేదిన కాల్వల నిర్మాణానికి వైఎస్‌ఆర్ శంకుస్థాపన చేశారు. ఎత్తిపోతల ప్రాజెక్టు కుడి కాల్వ కింద సదాశివపేట, మునిపల్లి, సంగారెడ్డి మండలాలకు 2500 ఎకరాలు, ఎడమ కాల్వ ద్వారా అందోల్, పుల్‌కల్, రేగోడ్ మండలాల్లో 37,500 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టు రూపకల్పన చేశారు.
మొదటి విడత కింద రూ.35 కోట్లు వైఎస్‌ఆర్ విడుదల చేశారు. ఆయన హయాంలోనే దాదాపు 50 శాతం పనులు పూర్తి అయ్యాయి. వైఎస్‌ఆర్ మరణం తర్వాత మూడేళ్ల వరకు ప్రాజెక్టు గురించి ఎవరూ పట్టించుకోలేదు. 2012లో అప్పటి ప్రభుత్వం రూ.16.50 కోట్లు కేటాయించింది. కానీ, వాటిలో రూపాయి కూడా ఖర్చు చేయలేదు. తిరిగి అవే ని«ధులను 2014 బడ్జెట్‌లో కేటాయించారు.
ఈ నిధులు వినియోగించి ఎడమకాల్వ లిఫ్ట్ పనులు అసంపూర్తిగా ఉన్న సమయంలోనే సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. దీంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా ట్రయల్‌రన్ నిర్వహించింది. అప్పటి ఉప-ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ 2014, ఫిబ్రవరిలో సింగూరు తూముల నీళ్లు వదిలారు. కొద్దిపాటి జల ఉధృతికే తట్టుకోలేక కాల్వలు తెగిపోయాయి. దీంతో అధికారులు శాశ్వతంగా గేట్లు మూసివేశారు.
24 కి.మీ.ల ట్రయల్‌రన్
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.50 కోట్లు కేటాయించి ప్రాజెక్టు పనులు పూర్తి చేశారు. గతంలో ట్రయల్‌రన్ నిర్వహించిన సమయంలో కొట్టుకపోయిన 24 కిలోమీటర్ల మేర కాల్వలను కట్టుదిట్టం చేశారు. గతంలో పూర్తి చేయకుండా వదిలేసిన 60 కిలోమీటర్ల ప్రధాన కాల్వని పూర్తిచేసి.. పిల్ల కాల్వలను అనుసంధానం చేశారు. మలి విడత పనులు ప్రారంభించిన నాటి నుంచి పూర్తి అయ్యే వరకు మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షించారు. శుక్రవారం 4 పంపుల ద్వారా 450 క్యూసెక్కుల జలాలను దిగువకు వదలనున్నారు. ఈ నీళ్లతో ముందుగా ఆందోల్ పెద్ద చెరువును నింపుతారు. అక్కడి నుంచి గొలుసుకట్టు చెరువులను నింపుతారు.
హైదరాబాద్‌కు నీళ్లు నిలిపివేత
మిషన్ భగీరథ జలాలు, కృష్ణా బేసిన్ నుంచి హైదరాబాద్‌కు అందుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సింగూరు నుంచి హైదరాబాద్‌కు మంచినీటి సరఫరా నిలిపివేసింది. దీంతో ప్రాజెక్టులో 9 టీఎంసీల జలాలలు మిగులుతాయి. మరోవైపు గజ్వేల్, దుబ్బాక ప్రాంతానికి కూడా మిషన్ భగీరథ జలాలు వస్తుండటంతో ఇక్కడ మరో టీఎంసీలు మిగిలే అవకాశం ఉంది. ఈ మొత్తం జలాలను మెతుకుసీమ రైతాంగం సాగు అవసరాలకే వినియోగిస్తామని నీటిపారదల శాఖ అధికారులు చెప్పారు.