ఆన్లైన్లో స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేస్తే..!
మంగళగిరి: ఆన్‌లైన్‌లో మొబైల్ ఫోన్ ఆర్డర్ చేస్తే విమ్ సబ్బు వచ్చిన ఘటన మంగళగిరిలో చోటుచేసుకుంది. దీంతో వినియోగదారుడు లబోదిబోమంటూ గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల కథనం మేరకు... పట్టణానికి చెందిన జొన్నాదుల హేమ నాగవరప్రసాద్ అనే యువకుడు ఈ నెల ఒకటో తేదీన పానాసోనిక్ ఏ2 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు అమేజాన్ కంపెనీకి అన్‌లైన్‌లో ఆర్డర్ చేశాడు. ఫోన్ ఖరీదు రూ. 9800 ఆన్‌లైన్‌లోనే కంపెనీకి చెల్లించాడు.
బ్లూడాట్ కొరియర్ నుంచి శుక్రవారం డెలివరీ బాయ్ వచ్చి ప్యాకెట్‌ను అందజేయగా అందులో విమ్‌బార్ సబ్బు వచ్చింది. ఇది చూసి కంగుతిన్న వినియోగదారుడు కొరియర్ బాయ్‌ని ప్రశ్నించగా తనకెలాంటి సంబంధం లేదని, కంపెనీపై కేసు పెట్టాలని, తాను పార్శిల్‌లో సబ్బు వచ్చినట్లు సాక్ష్యం చెబుతానని చెప్పడంతో చేసేదేంలేక బాధితుడు ప్రసాద్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ బొప్పన బ్రహ్మయ్య మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు జాగ్రత్త వహించాలని సూచించారు.