సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. పోకిరి వేషం
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. పోకిరి వేషం
Published Wed, Aug 9 2017 12:23 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM
ఫేస్‌బుక్, వాట్సప్‌ల్లో యువతిని వేధిస్తున్న వైనం
లైంగిక వాంఛ తీర్చాలంటూ బెదిరింపులు
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యాయత్నం
పోలీసుల అదుపులో నిందితుడు
నిర్భయతో సహా 18 సెక‌్షన్‌లతో కేసు నమోదు
స్నేహం.. ప్రేమ.. పేరుతో చదువుకునే రోజుల్లో ఓ యువతితో చనువుగా మెలిగాడు. అప్పటి ఫొటోలను భద్రపరుచుకుని ఇప్పుడు ఆమెను వేధిస్తున్నాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నా పోకిరీ వేషాలు వీడలేదు. అక్కడితో ఆగకుండా ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను యువతి బంధువులకు పంపి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడు. ఇందుకు సోషల్ మీడియాను వారధిగా చేసుకున్నాడు. ఈ ప్రబుద్ధుడి ఆగడాలు తాళలేక యువతి గోదావరిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేసిన ఘటన నరసాపురంలో చోటుచేసుకుంది.
నరసాపురం
నరసాపురం సీఐ ఎం.సుబ్బారావు మంగళవారం రాత్రి తన కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. స్థానిక పంజా సెంటర్‌కు చెందిన షేక్ అబ్దుల్‌రహీమ్ పట్టణంలోని ఓ కళాశాలలో పీజీ చేస్తుండగా తనతో పాటే చదువుకున్న పట్టణంలోని కోవెలగుడి ప్రాంతానికి చెందిన యువతితో స్నేహంగా మెలిగాడు. ఫేస్‌బుక్, వాట్సప్‌ల్లో వీరు చాటింగ్ చేస్తూ చనువు పెంచుకున్నాడు. ఈ క్రమంలో ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు. రహీమ్ శృతి మించడంతో పాటు ఇద్దరు కులాలు వేరు కావడంతో ఆమె అతడిని దూరం పెడుతూ వచ్చింది.
డబ్బులు గుంజినా ఆగని వేధింపులు
చదువు పూర్తయిన తరువాత అబ్ధుల్‌రహీమ్‌కు బెంగళూరులోని ఓ ప్రముఖ సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. రెండేళ్ల క్రితం మరో యువతితో పెళ్లి కూడా అయ్యింది. అయినా రహీమ్ బుద్ధి మారలేదు. పాత ఫొటోలు, బూతు బొమ్మలను ఫేస్‌బుక్, వాట్సప్‌ల్లో కోవెలగుడి ప్రాంతానికి చెందిన యువతికి పంపుతూ వేధిస్తున్నాడు.
యువతిని పెళ్లి చేసుకోవద్దని, తాను చెప్పినట్టు వినాలని బెదిరిస్తున్నాడు. మరీ బరి తెగించి యువతి తల్లితండ్రులతో పాటు బంధువులకు పాత ఫొటోలు పంపి వేధిస్తున్నాడు. తన లైంగిక వాంచలు తీర్చకపోతే మొత్తం ఫొటోలు ఆన్‌లైన్‌లో పెడతానని హెచ్చరించాడు. దీంతో భయపడిన యువతి తల్లిదండ్రులు రహీమ్‌కు భారీగా నగదు కూడా ముట్టచెప్పారు. అయినా రహీమ్ వేధింపులు ఆగలేదు.
యువతి ఆత్యహత్యాయత్నం
రహీమ్ వేధింపులు భరించలేక యువతి సోమవారం పట్టణంలో గోదావరిలో దూకి ఆత్యహత్యకు యత్నించింది. స్థానికులు ఆమెను కాపాడి ఇంటికి చేర్చారు. దీంతో యువతి తల్లితండ్రులు, బంధువులు పోలీసులను ఆశ్రయించారు. సీఐ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపి మంగళవారం నిందితుడిని పట్టుకున్నారు. రహీమ్ వద్ద ల్యాప్‌టాప్‌తో పాటుగా రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిర్భయ యాక్ట్, ఐటీయాక్ట్, సైబర్ క్రైమ్ యాక్ట్‌లతో పాటుగా ఐపీసీలోని 18 సెక‌్షన్లతో రహీమ్‌పై కేసు నమోదు చేసినట్టు సీఐ వివరించారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో యువతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈతరహా ఇబ్బందులు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.
Advertisement