వెన్నంటి ఉంటాడు... వెన్నలా కరుగుతాడు
సందర్భం : పావగడ ఆలయంలో శ్రావణ శనివారోత్సవాలు
శాంతి స్వరూపుడైన శనీశ్వరుడు తనకు ఇష్టమొచ్చిన రీతిలో సంచరిస్తూ.. భక్తులు పెడదారి పట్టకుండా వెన్నంటే ఉంటాడని, పాపులను పట్టి పీడిస్తుంటాడని పురాణాలు చెబుతున్నాయి. సకల దేవతలను సైతం గడగడలాడించిన శనీశ్వరుడు నిజమైన భక్తుల పాలిట వెన్నలా కరిగిపోతాడనే ప్రతీతి కూడా ఉంది. కష్టాలను తొలగించే స్వామిగా ఖ్యాతి గడించిన శనీశ్వరుడి ఉత్సవాలు పావగడలో నేత్రపర్వంగా సాగుతున్నాయి. శ్రావణ శనివారోత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
పావగడ: స్థానిక శనీశ్వరాలయంలో కొలువుతీరిన శనైశ్చర స్వామి శ్రావణ శనివారోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పావగడలో వెలసిన శనీశ్వరుడు శాంత స్వరూపుడని ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణస్వామి అంటున్నారు. శ్రావణ మాసంలో స్వామి వారిని కొలిస్తే కష్టాలు తొలగి సుఖాలు ప్రాప్తిస్తాయని చెబుతున్నారు. ఏలినాటి శని తొలిగిపోవడానికి పావగడ శనీశ్వరుడినే కొలవాలని అంటున్నారు.
ఆలయ చరిత్ర...
పావగడ నడిబొడ్డున వెలసిన శనీశ్వరాలయం సుమారు 70 సంవత్సరాల క్రితం ఓ చిన్న గుడిలా ఉండేది. ఓ భక్తుడు శనీశ్వర స్వామి చిత్ర పటాన్ని ఇక్కడి చెట్టు కింద పెట్టి పూజించేవాడు. కాల క్రమేణా శనీశ్వర స్వామిని పూజించే భక్తుల సంఖ్య ఎక్కువైంది. దీంతో కొంత మంది ధర్మకర్తలతో కమిటీ ఏర్పడింది. కమిటీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం పూర్తి అయింది. అప్పట్లో పట్టణంలో కలరా వ్యాపించి పట్టణవాసులు మృత్యువాత పడుతుండేవారు. ఇలాంటి తరుణంలో శాంతి చేకూర్చే శీతల యంత్రాన్ని ఆలయంలో ప్రతిష్టించారు. అప్పట్నుంచి వర్షాలు బాగా కురిసి పంటలు పండి కరువు తీరింది. కలరా తొలగి పట్టణవాసులు క్షేమంగా ఉన్నారు. ఆలయంలో శీతలాంభ దేవిని ప్రతిష్టించారు. తదనంతరం శనీశ్వర స్వామిని ప్రతిష్టించినట్లు ఆలయ ధర్మ కర్తలు తెలిపారు.
అంచెలంచెలుగా అభివృద్ధి
ఓ వైపు లక్షలాది మంది భక్తుల కానుకలు, విరాళాలతో ఆలయం అభివృద్ధి చెందుతుంటే మరో వైపు ఎస్‌ఎస్‌కే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌కే సముదాయ భవనం, బయలు రంగ మందిరం, డార్మెటరీ భవనం, అన్నపూర్ణ దాసోహ భవన నిర్మాణాలతో భక్తులకు ఎనలేని సేవలందిస్తున్నారు. ప్రతి శుక్ర, శని, ఆది, సోమవారాల్లో భక్తులకు ఉచిత భోజన వసతి కల్పించారు. మరో అడుగు ముందుకేసి విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. తుమకూరు రోడ్డులో డాక్టర్ పి.నారాయణప్ప ఉచితంగా అందించిన తొమ్మిది ఎకరాల స్థలంలో ఎస్‌ఎస్‌కే శాంతి పీయూ కళాశాలను నెలకొల్పారు.