‘పనామా’లో విశాఖ నల్లకూబేరుడు!
ఇక్కడా మోటూరు శ్రీనివాస ప్రసాద్ అవినీతి మూలాలు
గతంలో బయోడీజిల్ కేసులో అరెస్టు
ఆ తర్వాత లభించని ఆచూకీ
విశాఖపట్నం: పనామా ప్రకంపనలు జిల్లాలోనూ ప్రతిధ్వనించాయి. పన్నులు ఎగ్గొడుతూ పనామా రాజధాని హవాయిలో నల్లధనాన్ని దాచుకున్న నల్లకుబేరుల జాబితాలో ఉన్న మోటూరు శ్రీనివాస్ ప్రసాద్ అవినీతి మూలాలు విశాఖలోనూ ఉన్నాయి. ఆయన గతంలో జిల్లాలో పలు అక్రమ వ్యాపారాలు నిర్వహించి వార్తల్లోకి ఎక్కారు. ఓ కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు కూడా చేశారు. తరువాత శ్రీనివాస్ ప్రసాద్ ఏమయ్యారో తెలీదు. తాజాగా పనామా నల్ల కుబేరుల జాబితాలో ఆయన పేరు ఉండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మోటూరు శ్రీనివాస్ ప్రసాద్ 2006లో దువ్వాడ వీఎస్‌ఈజెడ్(విశాఖపట్నం స్పెషల్ ఎకనమిక్ జోన్)లో ఓ బయోడీజిల్ సంస్థను నెలకొల్పారు. యూరోపియన్ దేశాలకు బయోడీజిల్ ఎగుమతి చేసేవారు. అయితే ఈ ముసుగులో ఆయన నిబంధనలకు విరుద్ధంగా అమెరికా నుంచి బయోడీజిల్‌ను దిగుమతి చేసుకుని.. తిరిగి యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని 2011 డిసెంబర్‌లో ఆరోపణలు వచ్చాయి. దీనికోసం నిబంధనలకు విరుద్ధంగా వీఎస్‌ఈజెడ్ అధికారుల నుంచి ఎగుమతులకు అనుమతి పత్రాన్ని పొందారని కూడా వెల్లడైంది.
దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆయన నిబంధనలకు విరుద్ధంగా బయోడీజిల్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించారని నిగ్గుతేల్చారు. అప్పట్లోనే 19,300 టన్నుల బయోడీజిల్‌ను అక్రమంగా ఎగుమతి చేశారని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై మరింత లోతుగా విచారిస్తే గానీ ఈ అక్రమ వ్యాపారం గుట్టు బయటపడదని కూడా భావించారు. ఈ మేరకు వీఎస్‌ఈజెడ్ అధికారుల ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు శ్రీనివాస్ ప్రసాద్‌పై కేసు నమోదు చేశారు. 2012 ఏప్రిల్ 2న అతన్ని అరెస్టు చేసి కేసు విచారణ కొనసాగించారు. కానీ అప్పటి నుంచి శ్రీనివాస్ ప్రసాద్ ఏమయ్యారో ఎవరికీ పెద్దగా తెలియదు. తాజాగా పనామా నల్ల కుబేరుల జాబితాలో ఆయన పేరు కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన వ్యాపార వ్యవహారాలు మొదటి నుంచి కూడా సందేహాస్పదమేనని పోలీసులు చెబుతున్నారు.