
విద్యార్థిని కంటి నుంచి రాళ్ళు
- రాళ్ళు వస్తున్న సమయంలో కంటి నొప్పితో అవస్థ
- నాలుగు రోజులుగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థిని
మహబూబాబాద్ : 2వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కుడి కంటి నుంచి నాలుగు రోజులుగా చిన్న చిన్న రాళ్ళు వస్తున్నాయి. దీంతో ఆ విద్యార్థిని ఆ నొప్పితో అవస్థలు పడుతున్నది. వరంగల్ జిల్లా మహబూబాబాద్ పట్టణ శివారు లెనిన్‌నగర్ కాలనీకి చెందిన కాగితపు రాంమూర్తి, విజయ దంపతుల పెద్ద కుమార్తె స్పందన కుడి కన్ను నుంచి నాలుగు రోజులుగా చిన్న రాళ్ళు వస్తున్నాయి. కంటి నుంచి నీరు కారడంతో పాటు రాళ్ళు రావడంతో తీవ్ర నొప్పితో బాధపడుతోంది.
ప్రతిరోజు సుమారు 10 నుంచి 12 చిన్న చిన్న రాళ్ళు బయటకు వస్తున్నాయి. కంటి నుంచి వచ్చే నీరుతో ఆ చిన్న రాయి రెప్ప దగ్గరికి చేరుకుంటుంది. దాన్ని బయటకు తీసిన తర్వాత నొప్పి తగ్గుతుంది. మానుకోటలోని ఓ ప్రయివేట్ కంటి వైద్యశాలకు తీసుకెళ్ళగా వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్సను అందించారు. అయినప్పటికీ కంటి నుంచి రాళ్ళు వస్తూనే ఉన్నాయి. పెద్దాసుపత్రులలో చూపిస్తే వైద్య పరీక్షలు నిర్వహించి అందుకు కారణాన్ని తెలియపరుస్తారని స్థానిక వైద్యులు తెలిపారు. తన కూతురికి మెరుగైన వైద్యాన్ని అందించే స్థాయిలో లేనని, దాతలు ఆదుకుని తన కూతురుకు ఆ బాధ నుంచి విముక్తి కల్పించాలని రాంమూర్తి వేడుకుంటున్నాడు.