పాఠశాలకు వెళుతున్న పదో తరగతి విద్యార్థినిని ముఖానికి ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి పదునైన వస్తువుతో గాయపరిచిన ఘటన కలవరం రేపింది.
వీఆర్‌పురం(తూర్పుగోదావరి): పాఠశాలకు వెళుతున్న పదో తరగతి విద్యార్థినిని ముఖానికి ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి పదునైన వస్తువుతో గాయపరిచిన ఘటన కలవరం రేపింది. తూర్పు గోదావరి జిల్లా వీఆర్ పురంలో జరిగిన ఈ సంఘటన వివరాలు బాధిత బాలిక తెలిపిన దాని ప్రకారం ఇలా ఉన్నాయి. పట్టి నాగేశ్వరావుకు కుమార్తె ఐశ్యర్య వీఆర్ పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం 9 గంటలకు పాఠశాలకు వెళుతుండగా.. నాగార్జున గ్రామీణ బ్యాంక్ సమీపంలో ఓ బైక్ ఆమెకు దగ్గరగా వచ్చింది.
హెల్మెట్ ధరించిన వ్యక్తి బైక్ నడుపుతుండగా ముఖం కనబడకుండా కర్చీఫ్ కట్టుకున్న మరో వ్యక్తి ఆమె కుడిచేతిపై పదునైన వస్తువుతో గాయపరిచాడు. ఆ షాక్ నుంచి ఆమె తేరుకుని అరిచేలోపు అక్కడి నుంచి వారు ఉడాయించారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై డి. రామారావు పరిశీలించారు. విద్యార్థిని ఇంటి వద్ద, పాఠశాలలోను విచారణ చేపట్టారు. బాలిక చేతిపై గాట్లు పడ్డ తీరు అనుమానించదగిన రీతిలో ఉందని, పూర్తిస్థాయిలో దర్యాప్తు తర్వాత వివరాలు తేలుతాయన్నారు.