మద్యంపై విద్యార్థుల ఆగ్రహం
– ఆలూరులో ధర్నా, రాస్తారోకో
- ఎక్సైజ్ పోలీసుల హామీతో ఆందోళన విరమణ
ఆలూరు: పాఠశాలలు, కళాశాలల సమీపంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయొద్దంటూ ఆలూరు విద్యార్థులు.. భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేశారు. సోమవారం స్థానిక ప్రభుత్వ మోడల్ స్కూల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ జరిపారు. ఎల్లార్తి రోడ్డుకు సమీపంలో ప్రభుత్వ బాలికలు, బాలుర హైస్కూళ్లు, ప్రభుత్వ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల, ఐటీఐ, పాలిటెక్నికల్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయని, వీటికి సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. విద్యార్థుల ఆందోళనతో వాహనాలు ఆగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకోవడంతో విద్యార్థి సంఘం నాయకులు వారితో వాగ్వాదానికి దిగారు. ఎక్సైజ్ పోలీసుల హామీతో ఎట్టకేలకు ఆందోళన విరమించారు. ఆలూరు డివిజన్ ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు ప్రకాష్ , మైనా, ఆదోని డివిజన్ ఉపాధ్యక్షుడు చంద్రయ్యస్వామి, నాయకులు నాగరాజ్, వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.