షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలి
షుగర్ ఫ్యాక్టరీని మూసివేసి కార్మికులను వీధిన పడేసిన చైర్మన్ మధుసూదన్‌గుప్తపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రమేష్‌కుమార్ డిమాండ్ చేశారు.
- ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి డిమాండ్
నంద్యాలరూరల్: షుగర్ ఫ్యాక్టరీని మూసివేసి కార్మికులను వీధిన పడేసిన చైర్మన్ మధుసూదన్‌గుప్తపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రమేష్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతుందని, ఫ్యాక్టరీ చైర్మన్‌ను అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా రెండో రోజు శుక్రవారం నందిపల్లె రైతులు దీక్ష చేశారు. వీరికి సంఘీభావం తెలిపి రమేష్‌కుమార్ మాట్లాడారు. నంద్యాల, గిద్దలూరు, శ్రీశైలం, పాణ్యం, బనగానపల్లె, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లోని వేలాది మంది రైతులు ఫ్యాక్టరీకి చెరుకును తీసుకొచ్చేవారని, ఫ్యాక్టరీ మూతతో ఇప్పుడా పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పేరుతో బ్యాంకుల్లో రుణం పొంది మోసానికి పాల్పడ్డ చైర్మన్‌పై 420కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెంచి రైతులకు రావాల్సిన బకాయిలను, రుణమాఫీని, కార్మికులకు అందాల్సిన వేతనాలను చైర్మన్ ద్వారా ఇప్పించి ఫ్యాక్టరీ మూతపడకుండా కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. దీక్షల్లో భారతీయ కిసాన్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, చెరుకు రైతు సంఘం నాయకులు సాగేశ్వరరెడ్డి, బంగారురెడ్డి, ఈశ్వరరెడ్డిలు పాల్గొనగా మహానంది మండలం నందిపల్లెకు చెందిన చెరుకు రైతులు వెంకటరెడ్డి, మౌలాలి, రామకోటేశ్వరరెడ్డి, పెద్ద మహానందిరెడ్డి, మద్దయ్య, ఖాజాహుసేన్, మోహన్‌రావు, గుర్రప్ప, కౌలు రైతు సంఘం డివిజన్ కార్యదర్శి మార్క్‌లు దీక్షలో కూర్చున్నారు.