నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్:
తుపాను కారణంగా జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీకాంత్ అధికారులను ఆదేశించారు. స్థానిక గోల్డెన్‌జూబ్లీహాల్లో గురువారం తుపానుపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుపాను కేంద్రం నుంచి వచ్చే హెచ్చరికలను అనుసరించి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ప్రత్యేకాధికారులు, , కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఉం డాలన్నారు. నిత్యావసర వస్తువులైన బియ్యం,పప్పు, కిరోసిన్‌లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. భారీ వర్షాల వల్ల చెరువులు, కాలువ కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇసుక బస్తాలు, గోనె సంచులను సిద్ధం చేసుకోవాలన్నారు. అత్యవసర వైద్యసేవల్లో భాగంగా వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యంతో పాటు తగిన మందులు సిద్ధంగా ఉంచాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలన్నారు. జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ విశాఖపట్నానికి సుమారు 800 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందన్నారు. ఇది తుపానుగా మారి శుక్రవారం అర్ధరాత్రి కళింగపట్నం, ఒడిశాలోని గోపాల్‌నగర్‌వద్ద తీరం దాటే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని 11 మండలాల్లోని 25 గ్రామాల్లో 250 మంది గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచామన్నారు. తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేం దుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని జేసీ తెలిపారు.వివరాల కోసం 0861-2331477, టోల్‌ఫ్రీ నంబరు 1800 425 2499 లో సంప్రదించాలన్నారు. సమావేశంలో ఏజేసీ పెంచలరెడ్డి, ఏఎస్పీ మూర్తి, డీఆర్వో రామిరెడ్డి, ట్రైనీ కలెక్టర్ అళగ వర్షిణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తుపానుపై జాగ్రత్తలు తీసుకోండి
Published Fri, Oct 11 2013 6:03 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement
Advertisement