కిలారి, కోటంరెడ్డికి అవమానం
-
హెలిప్యాడ్ వద్దకు అనుమతించని పోలీసులు
-
డోర్‌ఫ్రేం మెటల్ డిటెక్టర్‌ను తోసేసిన కోటంరెడ్డి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు, నగర పార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి తీవ్ర అవమానం జరిగింది. హెలిప్యాడ్ వద్దకు వెళ్లబోయిన వీరిని పోలీసులు పక్కకు నెట్టేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ కోటంరెడ్డి పోలీసులు తనిఖీలు నిర్వహించే డోర్ ఫ్రేం మెటల్ డిటెక్టర్‌ను తోసేశారు. రొట్టెల పండగకు సీఎం చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో హెలికాఫ్టర్‌లో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు వచ్చారు. సీఎంకు స్వాగతం పలకడానికి పలువురు నాయకులు హెలిప్యాడ్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు, నగర పార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి బొకేలు తీసుకుని వెళ్లబోగా జాబితాలో మీ పేర్లు లేవని పోలీసులు అనుమతించలేదు. లోనికి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించిన వీరిని పోలీసులు పక్కకు నెట్టేశారు. తాను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నని కిలారి, తాను నగర పార్టీ అధ్యక్షుడినని కోటంరెడ్డి చెప్పుకున్నా పోలీసులు ఏ మాత్రం లెక్కపెట్టలేదు. జాబితాలో పేర్లు లేనందున అనుమతించేది లేదని తెగేసి చెప్పారు. దీంతో పోలీసుల తీరుపై ఇద్దరు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వివాదానికి దిగారు. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి డోర్ ఫ్రేం మెటల్ డిటెక్టర్‌ను పక్కకు తోసేసి లోనికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు పక్కకు తోసేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదరవిచంద్ర వచ్చి పోలీసులకు సర్ధిచెప్పి వారిని లోనికి తీసుకుని వెళ్లారు. జరిగిన ఘటనపై ఇద్దరు నేతలు తీవ్ర ఆవేదన చెందారు.
మాజీ వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ను అడ్డుకున్న పోలీసులు
సీఎం చంద్రబాబు నాయుడు బారాషహీద్ దర్గాకు వస్తున్న సమయంలో పోలీసులు ముఖ్యులను మాత్రమే దర్గాలోనికి అనుమతించారు. వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ సయ్యద్ సమీ దర్గాలోనికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. తాను వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్‌నని చెప్పినా జాబితాలో పేరు లేనందున పంపేది లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అతను దర్గా ఎదుట నేల మీద బైఠాయించారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగడంతో పోలీసులు అతన్ని పక్కకు ఈడ్చుకునిపోయారు. దర్గా దర్శనం విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని సమీ ఆరోపించారు. నగర డీఎస్పీ రాముడు జోక్యం చేసుకుని వివాదాన్ని సర్దుబాటు చేసి సమీని దర్గాలోకి పంపేలా ఏర్పాటు చేశారు.