
పెళ్లైన మూడు నెలలకే అనంతలోకాలకు...
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
ఆరిలోవ : అనకాపల్లి వెళ్లొస్తూ ప్రమాదవశాత్తూ చోడవరం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరిలోవలో టి.ఐ.సి.పాయింట్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... టి.ఐ.సి.పాయింట్ ప్రాంతానికి చెందిన ప్రసాద్(26)తో పాటు మరో ఇద్దరు స్నేహితులు బైక్‌పై ఆదివారం అనకాపల్లి వెళ్లారు. వారు తిరిగి వస్తుండగా చోడవరం సమీపంలో బైక్ అదుపు తప్పడంతో కింద పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆటో బైక్ నడుపుతూ కిందపడిన ప్రసాద్ మీదకు ఎక్కేసింది.
దీంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చొన్న పాల్ అనే యువకుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో స్నేహితుడికి చేతులపై స్వల్ప గాయాలయ్యాయి. ప్రసాద్‌కు మూడు నెలల క్రితమే వివాహమైంది. అతని భార్య ఆషాడం కావడంతో కన్నవారింటికి వెళ్లింది. ఇంతలోనే ప్రసాద్ మృత్యువాత పడ్డాడు. అక్కడి పోలీసులు ప్రసాద్ మృతదేహాన్ని అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన పాల్‌ను చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ప్రసాద్ తల్లిదండ్రులు కన్నీరు పర్యంతమై సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. ప్రసాద్ కార్పెంటర్ వర్క్ చేస్తాడని స్థానికులు తెలిపారు.