తెలుగు మీడియం కొనసాగించాలి
తెలుగు మీడియం కొనసాగించాలి
Published Fri, Jan 6 2017 11:56 PM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM
– కలెక్టరేట్ ఎదురుగా జీఓ నెం.14 జీఓ కాపీలు దగ్దం
కర్నూలు (న్యూసిటీ): మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియాన్ని కొనసాగించాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎన్.నరసింహుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూటీఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నం.14 కాపీలను దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. తెలుగుమీడియం ఎత్తేస్తే మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సురేష్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామశేషయ్య మాట్లాడుతూ తెలుగు జాతి, తెలుగు భాషను కాపాడటానికి తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని గొప్పలు చెప్పే నాయకులు ఇప్పుడు నోరు మెదపడం లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే జీఓ నెం.14ను రద్దు చేయాలని లేకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జి.ఆనంద్, జిల్లా కార్యదర్శి జి.ఆనంద్‌కుమార్, జిల్లా నాయకులు నాగరాజు, శశికుమార్, రఫీ, తిరుమల చౌదరి పాల్గొన్నారు.
Advertisement