19 నుంచి ‘టెట్’ దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టీఎస్ టెట్) నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. టెట్ షెడ్యూలుకు సంబంధించిన ఫైలుపై పాఠశాల విద్య డెరైక్టర్ జి.కిషన్ గురువారం సంతకం చేశారు. దీంతో ఈనెల 16న నోటిఫికేషన్ జారీ చేసేందుకు టెట్ కమిటీ చర్యలు చేపడుతోంది. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 9 వరకు ఫీజుల చెల్లింపునకు షెడ్యూలును ఖరారు చేశారు. 19వ తేదీ నుంచి వచ్చే నెల 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఒక పేపరు రాసినా, రెండు పేపర్లు రాసినా రూ. 200 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను (http://tstet.cgg.gov.in) ఈ నెల 16 నుంచి అందుబాటులోకి తేనుంది.
రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), ఇతర పండిత శిక్షణ కోర్సులను ఇటీవల పూర్తి చేసిన దాదాపు లక్ష మంది అభ్యర్థులతోపాటు గతంలో టెట్ రాసినా అర్హత సాధించని లక్షల మంది అభ్యర్థులు టెట్ కోసం ఎదురుచూస్తున్నారు. టెట్‌లో అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ రాసేందుకు అర్హులుగా పరిగణనలోకి తీసుకోనుండటంతో (టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది) టెట్ కోసం అభ్యర్థులు ఎదురుచూడక తప్పడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ ఇప్పటివరకు నాలుగు టెట్‌లను నిర్వహించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 10 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా ముందుగానే టెట్ నిర్వహణకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా ఐదో టెట్ (తెలంగాణ రాష్ట్రంలో మొదటి టెట్) నిర్వహణకు ఈనెల 16న నోటిఫికేషన్ జారీ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి వంటి మొత్తం ప్రక్రియను 2016 ఫిబ్రవరి 12 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. దీంతో మార్చి లేదా ఏప్రిల్‌లో డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశం ఉంది. సిలబస్, దానికి సంబంధించిన వివరాలతోపాటు అర్హతల వివరాలను ఈ నెల 16న జారీ చేసే నోటిఫికేషన్ సందర్భంగా వెబ్‌సైట్‌లోని ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో అందుబాటులో ఉంచుతారు.అలాగే సిలబస్‌కు సంబంధించి ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పాఠ్యపుస్తకాల్లోని మార్పుల ఆధారంగానే టెట్ సిలబస్ ఉంటుంది.