పాఠశాలల్లో 15వేల మంది,కాలేజీల్లో 159 మంది సర్దుబాటు
ఖాళీ పోస్టులు భర్తీచేయకుండా ఎత్తుగడ
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు కుమ్మరిస్తోంది. ఖాళీలను భర్తీచేయడంతోపాటు కొత్తగా ఉద్యోగాలను కల్పిస్తారని ఆశించిన నిరుద్యోగులు ప్రభుత్వ తీరుతో తీవ్రనిరాశ, నిస్పృహల్లో పడుతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయ, అధ్యాపకుల పోస్టుల భర్తీకోసం ప్రభుత్వం డీఎస్సీ తదితర ప్రకటనలు వెలువరిస్తుందని గత కొంతకాలంగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.
అయితే ప్రభుత్వం పనిసర్దుబాటు పేరిట ఖాళీ పోస్టుల్లో ఇపుడున్న ఉద్యోగులనే నియమిస్తూ, ఖాళీలు లేవన్న పేరిట భర్తీ చేయకుండా చేతులెత్తేస్తోంది. ఇంతకుముందు పాఠశాలల్లోని ఖాళీల సంఖ్యను కుదించేందుకు ప్రభుత్వం రేషన లైజేషన్ ప్రక్రియను చేపట్టబోయింది. ఉపాధ్యాయ సంఘాలనుంచి వ్యతిరేకత రావడంతో పనిసర్దుబాటు అంటూ కొత్త ఎత్తుగడలు వేసింది. పనిసర్దుబాటు పేరిట ఇటీవల 15వేల మంది ఉపాధ్యాయులను వివిధ పాఠశాలల్లోని ఖాళీ పోస్టులకు డిప్యుటేషన్ మీద బదిలీ చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ ఇటీవల ఆదేశాలు ఇచ్చారు.
పాఠశాలల్లోని ఈ ఖాళీ పోస్టులను ఇలా బదిలీలపై వచ్చే ఉపాధ్యాయులతో భర్తీచే స్తుండడంతో డీఎస్సీలో భర్తీచేయాల్సిన పోస్టుల సంఖ్య భారీగా కుదించుకుపోతోంది. డీఎస్సీలో 12వేలకు పైగా పోస్టులను భర్తీచేస్తామని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పలుమార్లు ప్రకటన చేసినప్పటికీ అది వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా రెండువారాల్లో డీఎస్సీని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. కానీ డీఎస్సీ ప్రకటించే నాటికి టీచర్‌పోస్టుల సంఖ్య క్రమేణా కుదించుకుపోతోంది.
తగ్గిపోయిన పోస్టులు: తొలుత 12వేలకు పైగా ఉన్న ఖాళీల సంఖ్య క్రమేణా చివరకు ఏడువేలకు తగ్గిపోయింది. ఇపుడు సర్దుబాటుపేరిట ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేస్తుండడంతో డీఎస్సీ నాటికి ఏమేరకు పోస్టులు ప్రకటిస్తారోనని నిరుద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సర్దుబాటు వ్యవహారం పాఠశాలలతోనే ఆగిపోలేదు. ఇపుడు డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
డీఎస్సీ ఆశలపై సర్కారు నీళ్లు!
Published Wed, Nov 5 2014 3:30 AM | Last Updated on Sat, Sep 15 2018 4:26 PM
Advertisement
Advertisement