రోదిస్తున్న కుటుంబసభ్యులు, బంధువులు
ఆ శవం టైలర్‌ది
Published Tue, Oct 18 2016 11:45 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
-గుర్తుతెలియని మృతదేహం ఆచూకీ లభ్యం
– విషాదంలో కుటుంబసభ్యులు
పత్తికొండ టౌన్: మద్దికెర సమీపంలో హంద్రీనదిలో తేలిన గుర్తుతెలియని మృతదేహం ఆచూకీ లభ్యమైంది. నాలుగురోజుల క్రితం హంద్రీకాలవలో దూకి ఆత్మహత్య చేసుకున్న పత్తికొండకు చెందిన టైలర్ రామకృష్ణగా గుర్తించారు. పత్తికొండ పట్టణం సవారమ్మ కాలనీకి చెందిన ముద్దన్న, చెన్నమ్మల రెండవ కుమారుడైన రామకృష్ణ (38) స్థానికంగానే పవన్‌టైలర్స్ పేరుతో సొంతంగా షాప్ పెట్టుకున్నాడు. ఇతనికి భార్య హనుమంతమ్మ, నలుగురు కుమార్తెలు సంతానం. టైలర్‌గా పనిచేస్తూనే వారిని బాగా చూసుకునేవాడు. అయితే, గత కొన్నాళ్ల నుంచి రామకృష్ణ తాగుడుకు బానిస అయ్యాడు. పని వదిలివేసి, ప్రతిరోజు తాగివచ్చి ఇంట్లో గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో గత 15వ తేదీన శనివారం రాత్రి ఫుల్‌గా మద్యం తాగివచ్చిన రామకృష్ణ అకారణంగా గొడవ పెట్టుకుని భార్య హనుమంతమ్మను చితకబాదాడు. ఆమె సృహ తప్పిపడిపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రామకృష్ణ ఆదోని రోడ్డులో ఉన్న హంద్రీకాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలువలో నీటిప్రవాహం అధికంగా ఉండటంతో మృతదేహం కొట్టుకుపోయి 2రోజుల తర్వాత సోమవారం మద్దికెర మండలం హంప వద్ద తేలింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రామకృష్ణ బంధువులు అనుమానంతో మద్దికెరకు వెళ్లి గుర్తుతెలియని శవాన్ని గుర్తించారు. మృతుడి తండ్రి ముద్దన్న ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న మద్దికెర ఎస్‌ఐ అబ్దుల్‌జహీర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంట్లో గొడవపడి వెళ్లిన రామకృష్ణ బంధువుల ఊరికి వెళ్లి ఉంటాడని భావించిన కుటుంబసభ్యులకు ఊహించని విధంగా శవమై కనిపించడంతో వారంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని టైలర్స్ అసోసియేషన్ తాలుకా అధ్యక్షుడు ఇస్మాయిల్ శరీఫ్, కార్యదర్శి తిక్కస్వామి, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు.
Advertisement