బంజారాహిల్స్ రోడ్ నెం. 10, 12లలో ఉన్న హుక్కా సెంటర్లలో నిబంధనలు ఉల్లంఘించి పోలీసు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అడ్డదారిలో హుక్కా సరఫరా చేస్తున్న కాఫీషాపులపై పోలీసులు దాడులు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని క్రేవ్ హుక్కా సెంటర్‌లో హుక్కా సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం రాత్రి దాడులు చేశారు.
అయితే ఈ నిర్వాహకుడు అలీ ప్రధాన గేటు మూసివేసి పోలీసులు లోనికిరాకుండా అడ్డుకున్నాడు. మూడు గంటల పాటు కస్టమర్లను లోపలే ఉంచి బయట నుంచి తాళాలు వేయించి పోలీసులు రాకుండా హంగామా సృష్టించాడు. దీంతో పోలీసులు నిర్వాహకుడిపై ఐపీసీసెక్షన్ 341, 188, 186 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అలాగే రోడ్‌నెం. 12లోనే ఉన్న నోస్టాల్జియా, స్కై పార్క్, రోడ్‌నెం. 10లో ఉన్న వాటర్, లెవల్స్ బిస్ట్రో తదితర హుక్కాసెంటర్లపై కూడా దాడులుచేసి పోలీసులు హెచ్చరికలు బేఖాతరు చేస్తూ హుక్కా సరఫరా చేస్తున్నందుకుగాను క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
నిర్వాహకులను అరెస్టు చేశారు. హుక్కా సరఫరా పూర్తిగా నిషేధించాలని సరఫరా చేస్తే దాడులు చేసి అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ విషయంలో కఠినంగా ఉంటామని వెల్లడించారు. హుక్కా సరఫరా చేసేవారు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని చెప్పారు. హుక్కా సరఫరా జరిగినట్లు తేలితే సెక్టార్ ఎస్‌ఐలదే బాధ్యత అని ఉన్నతాధికారులు పేర్కొన్న నేపథ్యంలో హుక్కా సెంటర్లు, కాఫీ షాపులపై అర్ధరాత్రి 3 గంటల దాకా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.