
33 అడుగులకు చేరువలో నీటిమట్టం
- గోదావరి నీటిమట్టం 33 అడుగులు
భద్రాచలం : ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదావరికి నీటిమట్టం పెరుగుతోంది. వారం రోజులుగా గోదావరి తగ్గుతూ.. పెరుగుతూ దోబూచులాడుతోంది. భద్రాచలం వద్ద శనివారం సాయంత్రం 33 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఆదివారం నాటికి 36 అడుగులకు పైగా చేరుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. భద్రాచలం వద్ద 43 అడుగులకు నీటిమట్టం చేరితేనే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. కానీ.. ఆ స్థాయిలో ప్రస్తుతం వరద రాదని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు తెలిపారు. కాగా.. ఎగువ ప్రాంతంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. వాజేడు వద్ద కొంగాలవాగు నీరు రోడ్డెక్కటంతో అటువైపు ఉన్న గ్రామాలతో మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి పరీవాహకంలో ఉన్న మండలాల అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉంటూ.. తగిన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీఓ, ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ రాజీవ్ ఆదేశించారు.