
‘రూ.2 లక్షలు ఇవ్వకుంటే కిడ్నాప్ చేస్తాం’
రూ.2 లక్షలు ఇవ్వకుంటే నీ కొడుకును కిడ్నాప్ చేస్తామంటూ అగంతకులు ఓ తల్లిని బెదిరించిన ఘటన
⇒అగంతకుల నుంచి మెసేజ్
⇒పోలీసులను ఆశ్రయించిన తల్లి
⇒నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన
నిజామాబాద్ క్రైం (నిజామాబాద్‌అర్బన్) : రూ.2 లక్షలు ఇవ్వకుంటే నీ కొడుకును కిడ్నాప్ చేస్తామంటూ అగంతకులు ఓ తల్లిని బెదిరించిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఆందోళన చెందిన ఆ తల్లి మంగళవారం పోలీసులను ఆశ్రయించింది. ఐదో టౌన్ ఎస్సై ఉపేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. సీతారాంనగర్ కాలనీకి చెందిన ప్రియకు పది నెలల కుమారుడు ఉన్నాడు. ఆమె భర్త స్విడాన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, సోమవారం రాత్రి ఆమె సెల్‌ఫోన్‌కు అగంతకుడి నుంచి మెసేజ్ వచ్చింది.
తనకు రూ.2 లక్షల ఇవ్వాలని, లేకపోతే నీ కొడుకును కిడ్నాప్ చేస్తామని ఆ మెసేజ్ సారాంశం. మెసేజ్ చూసి తీవ్రంగా కలత చెందిన ప్రియ స్థానికుల సలహాతో ఐదో టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. మెసేజ్ వచ్చిన ఫోన్ నెంబర్‌ను ఛేదించేందుకు యత్ని స్తున్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన వ్యక్తి పేరిటే ఆ నెంబర్ రిజిస్టర్ అయి ఉందని తెలిసింది. మరోవైపు, మంగళవారం కూడా ఆమె ఫోన్‌కు మళ్లీ మెసేజ్ రావడం గమనార్హం. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.