
నడి వీధిలో పట్టభద్రులు
♦ ఏపీ నిరుద్యోగ సేనలో 20 లక్షల మంది డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారే..
♦ ఈ యేడు జతకలవనున్న మరో 50 వేల మంది పట్టభద్రులు
♦ ఖాళీగా పడి ఉన్న లక్షన్నర ఉద్యోగాల భర్తీ జోలికి వెళ్లని ప్రభుత్వం
♦ మరో లక్ష మందిని రెగ్యులరైజ్ చేయకుండా తొలగించే ప్రయత్నాలు
♦ బాబొస్తే జాబొస్తుందన్న ఎన్నికల హామీని ఎగతాళి చేస్తున్న ప్రభుత్వం
♦ ఇన్ని లక్షల మందికి ఉపాధి దొరకాలంటే...
పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాల్సిందేనంటున్న నిపుణులు
♦ అందుకు ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని అభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో 20 లక్షల మంది పట్టభద్రులే (ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తి చేసిన వారు). వీరి సంఖ్య ప్రతి ఏటా 50 వేల మంది చొప్పున పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 27.23 లక్షల మంది నిరుద్యోగులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు గత నెల 18, 19 తేదీల్లో విజయవాడలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం ఓ నివేదిక ద్వారా తెలిపింది. అనధికార లెక్కల ప్రకారం నిరుద్యోగుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పేర్లు నమోదు చేసుకోలేకపోయిన వారు, నైపుణ్యంలేని (అన్‌స్కిల్డ్) వారిని ఇందుకు ఉదాహరిస్తున్నారు. రాష్ట్రంలో గత ఎన్నికలకు ముందు నిరుద్యోగులు, యువతకు స్పష్టమైన హామీలు ఇచ్చిన టీడీపీ... అధికారంలోకి వచ్చాకఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని, దీనివల్ల యువత ఉద్యోగాలు రాక, ఉపాధి అవకాశాలు లేక అభద్రతా భావానికి లోనయ్యే అవకాశం ఉందని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హామీల అమలేదీ?
యువత ఓట్లకు గాలం వేసేందుకు టీడీపీ గత ఎన్నికల్లో అనేక హామీలను గుప్పించింది. బాబొస్తే జాబొస్తుందని ప్రచారం చేసింది. ఇంటికో ఉద్యోగం, ఇవ్వలేకపోతే రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజ్, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, ఉపాధ్యాయుల నియామకం, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాల సృష్టి... తదితర హామీలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఖాళీగా ఉన్న లక్షన్నర ఉద్యోగాల భర్తీ ఊసెత్తడం లేదు.
ఇంకోవైపు మరో లక్ష మందిని రెగ్యులరైజ్ చేయకుండా తొలగిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నా.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకపోగా మంత్రుల కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ వస్తోంది. న్యాయస్థానం తీర్పు అడ్డు వస్తోందంటూ 40 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్ చేయకుండా సాకులు చూపుతోంది. 60 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్ చేయడానికి నిరాకరిస్తోంది. కనీసం వారి వేతనాల పెంపుపైనా ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేకపోయింది. మరో పక్క చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే 12 వేల మంది ఆదర్శ రైతులను ఉద్యోగాల నుంచి తొలగించారు.
అలాగే ఉపాధి హామీ పథకంలో భాగమైన 6 వేల మంది క్షేత్రస్థాయి అధికారులను ఉద్యోగాల నుంచి పీకేశారు. అలాగే గృహ నిర్మాణ సంస్థలో వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్న 6వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను, రాజీవ్‌గాంధీ స్వస్థీకరణ అభియాన్ కింద పనిచేస్తున్న 1500 మంది కంప్యూటర్ ఆపరేటర్లను తొలగించారు. 20 వేల మంది డ్వాక్రా యానిమేటర్లు గత ప్రభుత్వం నెలకు రూ.2 వేల చొప్పున ఇవ్వగా... టీడీపీ అధికారంలోకి రాగానే వారికి ఆ కొద్ది వేతనం ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. దీంతో వారంతా ఉపాధిని కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో 1,42,828 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక శాఖ లెక్క తేల్చింది. ఇందులో రాష్ట్ర స్థాయి పోస్టు లు 4,081, మల్టీ జోనల్ స్థాయిలో 1,184, జోనల్ స్థాయిలో 22,462, జిల్లా స్థాయిలో 1,15,101 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వమే చెప్పింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందులో ఇప్పటివరకు ఏ ఒక్క ఉద్యోగాన్నీ భర్తీ చేయలేదు.
ప్రత్యేక హోదా... ఒక్కటే మార్గం
వీరందరికీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు కావాలంటే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పాలి. పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా... ఒక్కటే మార్గం. ప్రత్యేక హోదా వల్ల పారిశ్రామిక రాయితీలు నేరుగా పరిశ్రమలకే వెళ్తాయి. తద్వారా పారిశ్రామివేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున దక్కుతాయి. అయితే, ఈ హోదా సాధించాలన్న ఆసక్తి, చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వంలో పూర్తిగా కొరవడింది. తద్వారా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తోంది.
ఏటా పెరుగుతున్న నిరుద్యోగులు..
రాష్ట్రంలో పాఠశాల స్థాయి నుంచి ఇంటర్మీడియెట్ స్థాయి వరకు మధ్యలో చదువు మానేస్తున్న వారి సంఖ్య 22 లక్షలని ప్రభుత్వం గుర్తించింది. వీరంతా తమ కుటుంబ ఆర్థిక స్థితిగతులతోపాటు ఇతర సమస్యల కారణంగా మధ్యలోనే చదువు మానేస్తున్నారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల్లో చదువుతున్న వారి సంఖ్య లక్ష, డిగ్రీ, పీజీ కాలేజీల్లో చదువుతున్న వారి సంఖ్య 1.50 లక్షల వరకు ఉందని రాష్ట్ర ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది.
ఇప్పటికే ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్న 27.23 లక్షల మందికి తోడు నమోదు చేసుకోలేకపోయిన వారు, ఆర్థిక పరిస్థితి బాగాలేక చదువు మధ్యలో మానేసిన వారు, అన్‌స్కిల్డ్ నిరుద్యోగు లు... వెరసి లక్షలాది మంది యువతీ, యు వకులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఏటా వీరి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో రాష్ట్రంలో యువత అభద్రతా భావంతో అశాంతికి లోనవుతోంది.