మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
దోమలగూడ: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నే అమలు చేసే వరకు అలుపెరుగని పోరాటం చేస్తామని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు అన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దుచేయాలని కోరుతూ టీసీపీఎస్‌ఈఎ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయులు మహాధర్నా నిర్వహించారు. టీజీఎ అధ్యక్షులు, ఎమ్మేల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు రాంచందర్‌రావు, జనార్దన్‌రెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు నర్సిరెడ్డి, చావ రవి, పీఆర్‌టీయూ నాయకులు హర్షవర్ధన్‌రెడ్డి, నరోత్తమరెడ్డి, ఎస్‌టీయూ నాయకులు భజంగరావు, సదానందగౌడ్, ఆర్‌యూపీపీ అధ్యక్షులు అబుల్లా తదితరులు సంఘీభావం ప్రకటించారు.
శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ యూపీఎ ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాల్లో చీకట్లు నింపిందన్నారు. సీపీఎస్ విధానం అమలుతో ఉద్యోగం వచ్చిందన్న సంతోషం లేకుండా పోయిందన్నారు. సీపీఎస్ రద్దుపై వచ్చే అసెంబ్లీ మాట్లాడుతానని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి తీర్మానం చేసేలా కృషి చేస్తానన్నారు. సీపీఎస్ రద్దు విషయాన్ని ఇప్పటికే కేంద్ర మంత్రి దృష్టికి తీసుకుళ్లానని, రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేర్కొన్నారు. కృష్ణకుమార్ మాట్లాడుతూ సీపీఎస్ విధానం అమలు కోసం బీకే భట్టాచార్య కమిటీ ఇచ్చిన నివేదిక లోపభూయిష్టమైందన్నారు.
సీపీఎస్ ఉద్యోగికి, అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి పెన్షన్ సౌకర్యం లేకపోవడంతో సీపీఎస్ కుటుంబాలకు భద్రత, సంక్షేమం లేదన్నారు. ఉద్యోగులు మరణించినా, పదవీ విర మణ చేసిన తర్వాత కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. సమైఖ్య రాష్ట్రంలో ఇచ్చిన జీవో 653, 654, 655 లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వెల్కిచర్ల రవి, వీరేశం, దర్శన్‌గౌడ్, బుచ్చన్న, దేవయ్య, శ్రీధర్, సునీల్‌కుమార్, బషీర్, సురేష్, సీహెచ్ సంతోష్, శ్రీనివాస్, సుధాకర్, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.